BJP: వచ్చే 30-40 ఏళ్లు దేశంలో అధికారం మాదే.. తెలంగాణపై ప్రత్యేక ప్రకటన: అస్సాం సీఎం

దేశంలో ప్రతిపక్షాన్ని ఇప్పటికే ప్రజలు మూలన కూర్చోబెట్టారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. వచ్చే 30-40 ఏళ్ల పాటు భాజపానే దేశంలో అధికారంలో

Published : 03 Jul 2022 15:09 IST

హైదరాబాద్‌: దేశంలో ప్రతిపక్షాన్ని ఇప్పటికే ప్రజలు మూలన కూర్చోబెట్టారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. వచ్చే 30-40 ఏళ్ల పాటు భాజపానే దేశంలో అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హెచ్‌ఐసీసీ వేదికగా భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు కొనసాగాయి. ఈ నేపథ్యంలో హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడారు.

‘‘రాజకీయ తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. చాలా అంశాలకు మార్పు, చేర్పులు సూచించారు. ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్మూ జీవితంపై ఓ చిత్రాన్ని కూడా తీయాలని సూచించారు. సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్ అన్నదే మా పార్టీ నినాదం. అందుకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయి. తెలంగాణపై భాజపా కార్యవర్గ సమావేశంలో ప్రత్యేక ప్రకటన ఉంటుంది. దానికి ముందే రాజకీయ తీర్మానంలోనూ వివిధ అంశాలపై చర్చించాం. కుటుంబ పాలన, రాష్ట్రంలో జరుగుతోన్న అరాచకాలపై చర్చ జరిగింది. త్వరలోనే తెలంగాణలోనూ కుటుంబ పాలన అంతమవుతుంది. దేశవ్యాప్తంగా రాజకీయాల్లో కుటుంబ రాజకీయాలు, జాతి, కులమత ప్రాంత వాదాలను నిరోధించాల్సిన అవసరం ఉందని అమిత్ షా తన తీర్మానంలో ప్రస్తావించారు. పనితీరు ఆధారిత పాలన, అభివృద్ధితో కూడిన పాలనపైనే భాజపా రాజకీయ తీర్మానంలో చర్చించింది’ అని హిమంత పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని