5 రాష్ట్రాల ఫలితాలు ఎందుకు ముఖ్యం..? రాష్ట్రపతి ఎన్నికపై ప్రభావం ఎంత..?
Assembly Elections: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముఖ్యమంత్రులనే కాదు.. ఈ ఏడాదిలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలోనూ కీలక పాత్ర పోషించనున్నాయి.
ఐదు రాష్ట్రాల ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఏడో తేదీన యూపీలో జరిగే చివరి విడత పోలింగ్‌తో ఎన్నికల సమరం ముగియనుంది. పదో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాలు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులనే కాదు.. ఈ ఏడాదిలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలోనూ కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఫలితాలు రాష్ట్రపతి ఎన్నికలో ఎందుకు కీలకం కానున్నాయి? కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకు ఉన్న సవాళ్లేంటనేది ఇప్పుడు చూద్దాం..
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24తో ముగియనుంది. ఇప్పటికైతే తమ అభ్యర్థిని రాష్ట్రపతి భవన్‌కు పంపించడానికి అధికార భాజపాకు ఎలాంటి ఇబ్బందీ లేనప్పటికీ.. త్వరలో వెలువడబోయే యూపీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే ఆ పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలో తెరాస, ఏపీలో వైకాపా, ఒడిశాలో బిజూ జనతా దళ్ (బిజద) రాష్ట్రపతి ఎన్నికలో కీలకం కానున్నాయి. ఈ మూడు పార్టీలు ప్రస్తుతం ఏ కూటమిలోనూ చేరకుండా తటస్థంగా ఉన్నాయి. ఒకవేళ యూపీ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైతే భాజపాకు ఈ మూడు పార్టీల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది.
యూపీనే ఎందుకు కీలకం..?
అతిపెద్ద రాష్ట్రమైన యూపీ రాష్ట్రపతి ఎన్నికల్లోనూ కీలక భూమిక పోషించబోతోంది. ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైన ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 208. మొత్తం యూపీ అసెంబ్లీలో 403 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ లెక్కన వీరి మొత్తం ఓటు విలువ 83,824 కానుంది. ఇక మిగిలిన ఎన్నికల రాష్ట్రాలను తీసుకుంటే పంజాబ్‌లో 117 మంది ఎమ్మెల్యేల ఓటు విలువ 116 చొప్పున 13,572; ఉత్తరాఖండ్ 70 మంది ఎమ్మెల్యేల విలువ 64 చొప్పున 4480; గోవాలోని 40 మంది ఓటు విలువ 20 చొప్పున 800; మణిపూర్‌లోని 60 మంది ఎమ్మెల్యేల ఓటు విలువ 18 చొప్పున 1080గా ఉంది. జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రమైన యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ దేశంలోనే అత్యధికం. సిక్కిం ఎమ్మెల్యే ఓటు విలువ కేవలం ఏడు మాత్రమే!
ఆ పార్టీల మద్దతు తప్పనిసరి..
రెండోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అకాలీదళ్, శివసేన వంటి మిత్రులు దూరమయ్యారు. కూటమిలో లేనప్పటికీ సన్నిహితంగా మెలిగిన కొన్ని పార్టీలు సైతం భాజపాను దూరం పెట్టాయి. ఈ పరిస్థితుల్లో ఎన్డీయే తన అభ్యర్థిని రాష్ట్రపతిగా నెగ్గించుకోవాలంటే మిత్ర పక్షాలతో పాటు సన్నిహితంగా మెలిగే పార్టీలను కలుపుకోవడం ముఖ్యం. గతంలో రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌ను నిలబెట్టినప్పుడు తెరాస మద్దతు పలికింది. ఇప్పుడు అదే పార్టీ భాజపాకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకభూమిక పోషించేందుకు ఆ పార్టీ అధినేత విపక్షాల మద్దతు కూడగట్టడంలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే విపక్ష పార్టీ నేతలను కలుస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం సైతం భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చీలిక తెచ్చేందుకు బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ను ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో రేపటి యూపీ ఎన్నికల ఫలితాల్లో ప్రతికూల ఫలితాలు వస్తే.. రాష్ట్రపతి ఎన్నికలో భాజపా తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.
రాష్ట్రపతి ఎన్నిక ఎలా..?
రాష్ట్రపతి ఎన్నికలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికైన ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకుంటారు. వీరిని ఎలక్టోరల్ కాలేజీ అంటారు. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదు. దిల్లీ, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికైన ఎమ్మెల్యేలకు సైతం ఓటు హక్కు ఉంటుంది. ఆ లెక్కన 233 మంది రాజ్యసభ సభ్యులు, 543 మంది లోక్‌సభ సభ్యులతో పాటు విధాసన సభలకు ఎన్నికైన 4,120 మంది ఎమ్మెల్యేలు.. మొత్తంగా 4,896 మంది రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఎంపీల ఓటు విలువ 708గా నిర్ణయించారు. ఎమ్మెల్యే ఓటు విలువ మాత్రం 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించారు. రాష్ట్రాలను బట్టి ఈ విలువ మారుతూ ఉంటుంది. ఎంపీలు, ఎమ్మెల్యేల అందరి ఓట్ల విలువ కలిపి మొత్తం 10,98,903 అవుతుంది. ఇందులో 50 శాతం+1 ఓటు వచ్చిన వారు రాష్ట్రపతి అవుతారు.
ఎవరి బలం ఎంత..?
భాజపాకు సొంతంగా 1431 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ తరఫున 766 మంది ఎమ్మెల్యేలు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రెండు పార్టీలూ కాకుండా ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీలకు 1923 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక లోక్‌సభలో ఎన్డీయేకు 334 మంది, రాజ్యసభలో 115 మంది సభ్యుల బలం ఉంది. అయితే, నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదు గనుక రాజ్యసభలో భాజపా బలం 106 మంది మాత్రమే. ఈ లెక్కన రాష్ట్రపతి ఎన్నికలో భాజపా సులువుగా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు కీలకం కానున్నాయి. అంటే 10వ తేదీ వెలువడే ఫలితాలే తదుపరి రాష్ట్రపతిని కూడా నిర్ణయించనున్నాయన్నమాట!
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Social Look: ఫ్యాషన్ షోలో ఖుషి.. దివి స్టైలిష్ అవతార్
-
stuntman sri badri: ‘భోళా శంకర్’ మూవీ పారితోషికాన్ని విరాళంగా ఇచ్చిన స్టంట్‌మ్యాన్ శ్రీబద్రి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Cheetah : భారత్‌కు ఉత్తర ఆఫ్రికా దేశాల చీతాలు.. పరిశీలిస్తున్న అధికారులు!
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!