Rahul Gandhi: ఆ పార్టీ భావజాలంలోనే ‘పిరికితనం’ దాగి ఉంది: రాహుల్‌

భాజపాపై రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) మరోసారి విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ సిద్ధాంతపు అంతరాత్మలో పిరికితనం దాగి ఉందని ఆరోపించారు.

Published : 06 Mar 2023 23:04 IST

లండన్‌: బ్రిటన్‌(Britain) పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ(Rahul Gandhi).. భాజపాపై మరోసారి విరుచుకుపడ్డారు. ఆ పార్టీ విద్వేషం, హింస అనే సిద్ధాంతాలను పాటిస్తోందని ఆరోపించారు. భాజపా(BJP) భావజాలం అంతరాత్మలోనే పిరికితనం దాగుందంటూ విమర్శించారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్(IOC) యూకే చాప్టర్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులతో నిర్వహించిన ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో రాహుల్‌ పాల్గొని మాట్లాడారు. ‘చైనా(China) మన కంటే చాలా శక్తిమంతమైనదని విదేశాంగ మంత్రి అన్నారు. ఇలా భావిస్తే.. మనం వారితో ఎలా పోరాడగలం? ఆ పార్టీ సిద్ధాంతపు ఆత్మలోనే పిరికితనం దాగి ఉంది’ అని చైనా విషయంలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాహుల్‌ ఆరోపణలు చేశారు.

అయితే, రాహుల్‌ గాంధీ చైనాను పొగుడుతూనే.. విదేశీ గడ్డపై భారత్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని భాజపా మండిపడుతోంది. రాహుల్‌ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ‘భారత విదేశాంగ విధానంపై అభ్యంతరాలు.. ఆ విషయంలో రాహుల్‌ గాంధీకి ఉన్న అవగాహనాలేమికి నిదర్శనం. విదేశీ గడ్డపై నుంచి భారత్‌పై చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని ఎవరూ నమ్మరు’ అని విలేకరులతో అన్నారు. తన వైఫల్యాలను దాచిపెట్టే కుట్రలో భాగంగానే ఈ మేరకు వ్యాఖ్యలు చేస్తున్నట్లు విమర్శించారు. ఇదిలా ఉండగా.. బ్రిటన్‌ పర్యటనలో ఉన్న రాహుల్‌ కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ.. కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో రాహుల్‌ బ్రిటన్‌ పార్లమెంట్‌లోనూ ప్రసంగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని