Atchannaidu: జగన్‌ సొంత సామాజికవర్గానికి పెద్దపీట.. మిగిలిన వారికి కత్తిపీట: అచ్చెన్న

ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లతో గద్దెనెక్కిన సీఎం జగన్‌.. అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు అడుగడుగునా అన్యాయం చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Updated : 25 Dec 2022 14:08 IST

అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లతో గద్దెనెక్కిన సీఎం జగన్‌.. అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు అడుగడుగునా అన్యాయం చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పదవుల పంపకం నుంచి బడ్జెట్‌ కేటాయింపుల వరకు సొంత సామాజికవర్గానికి ఆయన పెద్దపీట వేసి.. మిగిలిన వర్గాలకు కత్తిపీట వేస్తున్నారని ధ్వజమెత్తారు. 

‘‘2022-23 బడ్జెట్‌లో 5.53 శాతం ఉన్న గిరిజనుల పింఛన్లకు రూ.971కోట్లు కేటాయించిన జగన్‌.. తన సామాజికవర్గానికి చెందిన రెడ్డి కార్పొరేషన్‌ పింఛన్లకు మాత్రం రూ.1555కోట్లు కేటాయించారు. దామాషా ప్రకారం 17.08 శాతం ఉన్న ఎస్సీలకు రూ.7వేల కోట్లు, 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు రూ.16వేల కోట్లు కేటాయించాలి. కానీ ఎస్సీలకు రూ.3వేల కోట్లు, బీసీలకు రూ.8వేల కోట్లే కేటాయించి సగం నిధులు కోత కోశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలంటే జగన్‌కు ఎందుకంత కక్ష? సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అన్ని కులాల్ని ఆదరించాలి. అలా కాకుండా ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తూ జగన్‌ చేస్తున్న మోసాన్ని మిగిలిన వర్గాలు గ్రహించి వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి. చంద్రబాబు సీఎం అయితేనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నిజమైన సంక్షేమం, స్వాతంత్ర్యం లభిస్తుంది’’ అని అచ్చెన్నాయుడు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని