AP news: జగన్‌.. ఇకనైనా తెలుసుకో: అచ్చెన్న

సుప్రీంకోర్టు తీర్పుతోనైనా సీఎం జగన్ అమరావతిపై దుష్ప్రచారం మానుకుని ప్రజా రాజధాని నిర్మాణానికి సహకరించాలని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

Published : 20 Jul 2021 01:45 IST

అమరావతి: సుప్రీంకోర్టు తీర్పుతోనైనా సీఎం జగన్ అమరావతిపై దుష్ప్రచారం మానుకుని ప్రజా రాజధాని నిర్మాణానికి సహకరించాలని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హితవు పలికారు. అమరావతి భూముల వ్యవహారంలో ఎలాంటి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ లేదని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసిందన్నారు. సుప్రీం తీర్పుతో రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని స్పష్టమైందన్నారు. రాజధాని విషయంలో సీఎం తన తీరు మార్చుకోకపోతే.. మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.  ఎలాంటి ఖర్చూ లేకుండా అమరావతి నుంచి పాలన కొనసాగించే అవకాశం ఉన్నా, 3 రాజధానుల నిర్ణయంతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. అమరావతి నిర్మాణానికి సహకరిస్తానని ప్రతిపక్షంలో ఉండగా ప్రకటించిన జగన్... అధికారంలోకి రాగానే మాటెందుకు మార్చారని నిలదీశారు. అమరావతి అభివృద్ధితోనే 13 జిల్లాల అభివృద్ధి, యువతకు ఉపాధి, సంపద సృష్టి సాధ్యమని ఇకనైనా గుర్తించాలని అచ్చెన్నాయుడు హితవు పలికారు.

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై లిఖితపూర్వక ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్ర హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయగా.. దీనిపై జస్టిస్‌ వినిత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం సోమవారం సుదీర్ఘ విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దుష్యంత్‌ దవే, మెహఫూజ్‌ నజ్కి వాదనలు వినిపించగా.. ప్రతివాదుల తరఫున పరాస్‌ కుహాడ్‌, శ్యామ్‌ దివాన్‌, సిద్దార్ధ లూథ్రా వాదనలను ధర్మాసనం ముందు ఉంచారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు