తనిఖీలు చేయిద్దాం.. మద్యంలో ఎలాంటి రసాయనాలున్నాయో తెలుస్తుంది: అచ్చెన్నాయుడు

నాటుసారా మరణాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని.. ఈ అంశంపై చట్టసభలో చర్చించాలని అడిగినందుకే తమను సస్పెండ్ చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

Published : 24 Mar 2022 01:10 IST

ఉంగుటూరు: నాటుసారా మరణాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని.. ఈ అంశంపై చట్టసభలో చర్చించాలని అడిగినందుకే తమను సస్పెండ్ చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. సభలో తెదేపా ఎమ్మెల్యేలకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వనందునే బయటకు వచ్చి చెబుతున్నామని వెల్లడించారు. నాటుసారా తాగి 27 మంది చనిపోయారని వారి కుటుంబసభ్యులే చెప్పారన్నారు. ఉంగుటూరులో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.

‘‘నాటుసారా మరణాలను సహజ మరణాలని ఇవాళ కూడా సభలో సీఎం చెప్పారు. అంతటితో ఆగకుండా ప్రస్తుత బ్రాండ్లు అన్నీ తెదేపా అధినేత చంద్రబాబు తెచ్చారని అబద్ధాలు చెప్పారు. మా హయాంలో అసలు మద్యం బ్రాండ్ల గురించి ఎవరైనా ప్రశ్నించారా?అసలు మద్యం పాలసీని ఎందుకు మార్చారని సీఎంను ప్రశ్నిస్తున్నాం. మద్యం విధానాన్ని మార్చి.. దుకాణాలు తీసుకోవడం వల్లే సమస్య వచ్చింది. నచ్చిన బ్రాండ్‌ కొనుక్కొనే స్వేచ్ఛ వినియోగదారుడికి గతంలో ఉండేది. ఇవాళ రేటు చెప్పి మద్యం అడగాల్సిన దుస్థితి తీసుకొచ్చారు. మద్యం కొనుక్కోలేకే నాటుసారా తాగారని అందరికీ తెలుసు. ప్రతి మద్యం దుకాణంలో 10 సీసాలు తీసుకొని తనిఖీలు చేయిద్దాం. వాటిలో ఎంత మేర హానికరమైన రసాయనాలు ఉన్నాయో తెలుస్తుంది. మద్యం బ్రాండ్లు, తయారీ కంపెనీలపై మరిన్ని వివరాలు చెబుతాం.

దశలవారీగా మద్యపాన నిషేధం అని ఎన్నికల ముందు జగన్‌ చెప్పలేదా?వైకాపా ప్రభుత్వం వచ్చాక మద్యంపైనే ఎక్కువ ఆదాయం వస్తోంది. మద్యంపై ఆదాయం రూ.6వేల కోట్ల నుంచి రూ.16,500 కోట్లకు పెరిగింది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి చెప్పారు. వినియోగం తగ్గితే దాని ద్వారా వచ్చే ఆదాయం ఎలా పెరుగుతుంది? ఈ విషయాలను ప్రజలు ఒకసారి గమనించాలి. బ్రాండ్లపై మేం మాట్లాడకుండా చేశారంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. నాటుసారా మరణాలపై జ్యుడిషియల్‌ విచారణ వేసేందుకు ఎందుకు భయం వేస్తోంది. మరణాలపై ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం ఇవ్వకూడదా? కమిషనర్‌ను కలిసేందుకు ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వకుండా అరెస్టులు చేస్తారా?అరెస్టులు చేసినా, జైలులో పెట్టినా మా ఆందోళన ఆగదు. జె బ్రాండ్ మద్యం పూర్తిగా ఆగేవరకు పోరాటం చేస్తాం’’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు