Atchennaidu: విధ్వంసాలు వైఎస్సార్‌ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య: అచ్చెన్నాయుడు

కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటే మంగళవారం అంతమంది యువకులు ఎలా వచ్చారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

Updated : 25 May 2022 15:14 IST

అమరావతి: కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటే మంగళవారం అంతమంది యువకులు ఎలా వచ్చారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మంత్రి, ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగి ఆందోళనకారులు నిప్పు పెట్టారంటే అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడారు.

తెదేపా వ్యక్తి అయితే సజ్జల ఎందుకు ఫొటో దిగుతారు?

‘‘మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్‌ ఇంటికి పోలీసులు బందోబస్తు ఎందుకు పెట్టలేదు? జిల్లా కేంద్రంగా ఉన్న అమలాపురంలో ఫైరింజన్‌ ఒక్కటీ లేదా? ఎందుకు రాలేదు? ఈ విధ్వంసం చేయించింది వైకాపా కార్యకర్తలే అని క్లియర్‌గా తెలుస్తోంది. అన్యం సాయి అనే యువకుడు ఎవరు?గతంలో విశ్వరూప్‌ని ఆయన ఎందుకు సన్మానిస్తాడు?అతడు తెదేపా వ్యక్తి అయితే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన్ను ఎందుకు కౌగిలించుకుని ఫొటో దిగుతారు? దీనికి ప్రభుత్వం, సీఎం జగన్‌ సమాధానం చెప్పాలి.

విధ్వంసాలు చేయడం వైఎస్సార్‌ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోతే రిలయన్స్‌ వాళ్లు చంపేశారని ఆరోపిస్తూ వాళ్ల షాపులపై విధ్వంసం చేయించింది జగన్‌ కాదా? తునిలో రైలు తగులబెట్టింది వైకాపా కాదా? సీఎం పదవి కోసం కోడికత్తి డ్రామా ఆడింది ఎవరు? సొంత బాబాయిని ఇంట్లోనే చంపి ఎవరో చంపినట్లు బయటకు సృష్టించిన వ్యక్తి జగన్‌ అవునా? కదా?


 

వ్యతిరేకత వచ్చినపుడు డైవర్షన్‌..

జగన్‌ డైవర్షన్‌ సీఎం. ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినపుడు ఏదో ఒక ఇష్యూని తీసుకొచ్చి డైవర్ట్‌ చేస్తున్నారు. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను చంపి తీసుకొస్తే దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రీకరించారు. తెదేపా, ఇతర పక్షాలు పోరాడితే ఆయన బండారం బయటపడింది. ఈ విషయంలో వైకాపాకు చెడ్డపేరు వచ్చింది. మరోవైపు తెదేపా చేస్తున్న ‘బాదుడే-బాదుడు’ కార్యక్రమం విజయవంతమైంది. చంద్రబాబు ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 

వీటన్నింటినీ డైవర్ట్‌ చేసేందుకే ప్రభుత్వం అమలాపురంలో విధ్వంసానికి పూనుకుంది. ఇది ప్రణాళిక ప్రకారమే జరిగింది. సంఘటన జరిగిన వెంటనే దీని వెనుక తెదేపా ఉందంటూ మంత్రులు, వైకాపా నేతలు చెప్పడాన్ని ఏమనుకోవాలి? తప్పుడు సమాచారం ఇస్తే ప్రజలు నమ్ముతారనుకుంటే అది మీ భ్రమ. ఇలాంటి ఘటన జరిగితే సీఎం జగన్‌ ఉలుకూపలుకూ లేదు. ఆయన సమాధానం చెప్పాలి. ప్రజలు శాంతియుతంగా ఉండాలి. అమలాపురంలో మళ్లీ సాధారణ పరిస్థితి వచ్చేందుకు అందరూ సహకరించాలని తెదేపా తరఫున కోరుతున్నాం’’ అని అచ్చెన్నాయుడు అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు