Delhi: అతిషీకి విద్య.. భరద్వాజ్‌కు వైద్యం.. కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

దిల్లీలోని కేజ్రీవాల్‌(Kejriwal) కేబినెట్‌లో ఇద్దరు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం పూర్తయింది.  అతిషీ విద్య, భరద్వాజ్‌ వైద్య మంత్రిత్వశాఖల బాధ్యతలు చూడనున్నారు. 

Published : 09 Mar 2023 18:21 IST

దిల్లీ:  ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP) ఎమ్మెల్యేలు సౌరభ్‌ భరద్వాజ్‌(Saurabh Bhardwaj), అతిషీ(Atishi) సీఎం కేజ్రీవాల్‌(Kejriwal) కేబినెట్‌లో కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.  దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా వీరిద్దరితో గురువారం సీఎం కేజ్రీవాల్‌ సమక్షంలో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రామ్‌వీర్‌ సింగ్‌బిధుర్‌ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవల దిల్లీ మద్యం కేసులో మనీశ్‌ సిసోదియాను సీబీఐ అరెస్టు చేయడం, అంతకముందు మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సత్యేందర్‌ జైన్‌ తమ మంత్రి పదవులకు ఇటీవల రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఖాళీ అయిన రెండు మంత్రి పదవులను భర్తీ చేశారు. సిసోదియా నిర్వహించిన విద్యాశాఖతో పాటు  పబ్లిక్‌ వర్క్స్‌, విద్యుత్‌, పర్యాటక శాఖలను అతిషీ చూడనున్నారు. అలాగే, గతంలో జైన్‌ చూసిన వైద్య ఆరోగ్య శాఖతో పాటు పట్టణాభివృద్ధి, జలవనరులు, పరిశ్రమల శాఖలను ఇకనుంచి భరద్వాజ్‌ నిర్వహించనున్నారు.  

ఇటీవల సిసోదియా, జైన్‌ రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ఆ తర్వాత అతిషీ, భరద్వాజ్‌ పేర్లను సీఎం కేజ్రీవాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు పంపారు. దీంతో ఆయన వీరిద్దరి పేర్లను రాష్ట్రపతికి సూచించగా ఆమె అంగీకరించారు. అయితే, ఈ నెల 17 నుంచి జరిగే బడ్జెట్‌ సమావేశాల్లో వీరిద్దరు మంత్రులూ పాల్గొననున్నారు. 2013 నుంచి ఎమ్మెల్యేగా ఉన్న భరద్వాజ్‌.. కేజ్రీవాల్‌ సారథ్యంలో తొలిసారి ఏర్పాటైన ప్రభుత్వంలో కొద్ది కాలం పాటు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆప్‌ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న ఆయన.. దిల్లీ జల్‌ బోర్డు ఉపాధ్యక్షుడు కూడా. ఇక అతిషీ విషయానికి వస్తే.. పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉండే ఆమె 2020 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.  సిసోదియా విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు సలహాదారుగానూ పనిచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు