ప్రణాళిక ప్రకారమే మంత్రిపై బాంబు దాడి: మమతా

పశ్చిమబెంగాల్‌ మంత్రి జకీర్‌ హుస్సేన్‌పై బాంబు దాడి వ్యవహారంలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే జకీర్‌పై దాడి చేశారని ఆరోపించారు.

Published : 19 Feb 2021 01:03 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ మంత్రి జాకీర్‌ హుస్సేన్‌పై బాంబు దాడి వ్యవహారంలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే జాకీర్‌పై దాడి చేశారని ఆరోపించారు. అంతేకాకుండా కొందరు ఆయన్ను తమ పార్టీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నట్లు మమతా పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె గురువారం హుస్సేన్‌ చికిత్స పొందుతున్న ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిని సందర్శించారు. బుధవారం జరిగిన ఘటనతో పాటు, ప్రస్తుతం మంత్రి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మమతా రైల్వే వ్యవస్థ పనితీరుపై మండిపడ్డారు. మంత్రిపై దాడి రైల్వే పరిసరాల్లో జరిగిన కారణంగా.. ఈ ఘటనకు సంబంధిత శాఖనే బాధ్యత వహించాలని అన్నారు.

‘మంత్రి జాకీర్‌ హుస్సేన్‌పై ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి జరిగింది. ఆయనపై జరిగిన దాడి కుట్రలో భాగమే. జాకీర్‌ను పార్టీ మారాల్సిందిగా కొందరు ఆయనపై ఒత్తిళ్లు తెస్తున్నారు. ఈ దాడిపై విచారణ కొనసాగుతున్నందున నేను ఇంతకుమించి ఎక్కువ ఏం చెప్పలేను’ అని మమతా వెల్లడించారు. ఈ బాంబు దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.5లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష మమతా పరిహారం ప్రకటించారు. ఈ పేలుడులో మొత్తం 26 మంది గాయపడినట్లు మమతా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించినట్లు సీఎం తెలిపారు.

పశ్చిమబెంగాల్‌కు చెందిన మంత్రి జాకీర్‌ హుస్సేన్‌పై బుధవారం రాత్రి బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. ముర్షీదాబాద్‌ జిల్లా నిమ్‌తిరా రైల్వేస్టేషన్‌ నుంచి కోల్‌కతా వెళ్లేందుకు రైలు కోసం నిరీక్షిస్తున్న సమయంలో ఆయనపై దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని