Amaravati: బరి తెగించిన వైకాపా శ్రేణులు.. అమరావతిలో భాజపా నేతలపై దాడి

భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, ఆపార్టీ నేతలపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.అమరావతి పరిధిలోని ఉద్దండరాయునిపాలెం వద్ద ఈఘటన జరిగింది.

Updated : 31 Mar 2023 18:45 IST


అమరావతి: అమరావతి పరిధిలోని ఉద్దండరాయునిపాలెంలో వైకాపా కార్యకర్తలు బరితెగించారు. అమరావతి రైతుల ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా మందడంలో జరిగిన సభలో పాల్గొని తిరిగి విజయవాడ వెళ్తున్న సమయంలో భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, ఆపార్టీ నేతలపై దాడికి పాల్పడ్డారు. భాజపా నేతల వాహనాలు సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు వద్దకు రాగానే అక్కడ ఉన్న 3 రాజధానుల శిబిరం నుంచి వైకాపా నేతలు దూసుకొచ్చారు. వాహనాలకు అడ్డంగా నిలబడి 3 రాజధానులకు అనుకూలంగా నినాదాలు చేశారు. కొందరు భాజపా నేతలు కారు దిగి వారిని అడ్డు తొలగాలని చెప్పారు. దీంతో భాజపా నేతలపై వైకాపా శ్రేణులు ఒక్క సారిగా దాడికి దిగారు. ఒక్కొక్కరిని వెంటపడి తరిమికొట్టారు. సత్య కుమార్‌ ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. అప్రమత్తమైన పోలీసులు సత్యకుమార్‌ను అక్కడి నుంచి పంపించారు. పోలీసుల సాయంతో భాజపా నేతలు అక్కడి నుంచి బయటపడ్డారు. సత్యకుమార్ వాహనంపై దాడి ఘటనకు సంబంధించి తుళ్లూరు పోలీసులకు ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. భాజపా నేతలు సత్యకుమార్‌, ఆదినారాయణరెడ్డిని అంతమొందించేందుకు కుట్ర పన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ప్రాణాలకు ముప్పు కలిగించేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బీజేవైఎం నేత పనతల సురేష్ తెలిపారు. 

తాటాకు చప్పుళ్లకు భయపడం: సత్యకుమార్‌

దాడి ఘటన తర్వాత విజయవాడలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యకుమార్‌ మాట్లాడారు. వైకాపా తాటాకు చప్పుళ్లకు భయపడబోమని హెచ్చరించారు. భాజపా కార్యకర్తలపై దాడి చేస్తే తిరిగి దాడి చేయుడం కూడా తెలుసని.. కానీ, ప్రజాస్వామ్యంపై గౌరవంతో ప్రతిదాడులు చేయడం లేదన్నారు. దాడి వెనుక సూత్రధారులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దాడి ఘటనను కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. భాజపా కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడులు చేస్తుంటే పోలీసులు అడ్డుకోకుండా చోద్యం చూశారని ఆరోపించారు. మందడంలో వేలాది మంది రైతులు దీక్ష చేస్తుంటే 10 మంది పోలీసులు కూడా లేరని, 3 రాజధానులకు మద్దతుగా 10మంది దీక్ష చేస్తుంటే వంద మంది పోలీసులు ఎందుకున్నారని ప్రశ్నించారు. తాడేపల్లి నుంచి వచ్చిన డైరెక్షన్‌ మేరకు.. పథకం ప్రకారమే ఎంపీ నందిగం సురేష్ అనుచరులు దాడి చేశారని సత్య కుమార్‌ ఆరోపించారు. సీఎం జగన్‌ సారథ్యంలోనే ఇదంతా జరిగిందన్నారు.

3 రాజధానుల శిబిరం వద్ద ఎంపీ సురేష్ హల్‌ చల్‌

భాజపా నేతలపై దాడి ఘటనపై వైకాపా ఎంపీ నందిగం సురేష్‌ ఎదురుదాడికి దిగారు. భాజపా నేతలే 3 రాజధానుల శిబిరంపై దాడి చేశారని ఆరోపించారు. దాడి ఘటన తర్వాత  మూడు రాజధానుల శిబిరం వద్దకు చేరుకున్న ఎంపీ సురేష్‌ కాసేపు హడావుడి చేశారు. ధైర్యం ఉంటే భాజపా నేతలు ఇప్పుడు రావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. భాజపా నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

పక్కా ప్రణాళికతోనే దాడి జరిగింది: చంద్రబాబు

భాజపా నేత సత్యకుమార్‌ వాహనంపై వైకాపా గూండాల దాడిని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖండించారు. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వైకాపా మూకలు దాడి చేస్తున్నాయని ఆరోపించారు. దాడి చేసే వారిని పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని చంద్రబాబు ప్రశ్నించారు. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని