AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత.. తెదేపా ఎమ్మెల్యేలపై దాడి!

ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత నెలకొంది. తెదేపాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై దాడి జరిగినట్లు ఆ పార్టీ నేతలు ఆరోపించారు.

Updated : 20 Mar 2023 12:01 IST

అమరావతి: ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత నెలకొంది. తెదేపాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై దాడి జరిగినట్లు ఆ పార్టీ నేతలు ఆరోపించారు. శాసనసభలో చర్చ జరుగుతుండగా తెదేపా సభ్యులు నిరసన తెలిపారు. అనంతరం తెదేపా ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు తెలిపారు. దీనిపై వైకాపా సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఆ తర్వాత వైకాపాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోడియం వద్ద నిరసన తెలుపుతున్న తమ పార్టీ ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై వైకాపా ఎమ్మెల్యేలు దాడి చేసినట్లు తెదేపా సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తెదేపా ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు, ఇతర సభ్యులు మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

శాసనసభ చరిత్రలో చీకటి రోజు: అచ్చెన్నాయుడు

తమ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, సీనియర్‌ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైకాపా సభ్యులు దాడి చేశారని అచ్చెన్నాయుడు చెప్పారు. 75 ఏళ్ల వయసున్న వ్యక్తి, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్యపై మాజీ మంత్రి వెల్లంపల్లి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ‘‘జీవో1 రద్దు చేయాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చాం.. దానికి స్పీకర్‌ అంగీకరించలేదు. మేం పోడియం దగ్గర నిరసన తెలిపాం. మేం తప్పు చేస్తే స్పీకర్‌ చర్యలు తీసుకుని మమ్మల్ని సస్పెండ్‌ చేయాలి.

పోడియంపైకి వైకాపా ఎమ్మెల్యేలు గూండాల మాదిరిగా వచ్చారు. ఇంత దారుణంగా ప్రత్యక్ష దాడి చేసి శాసనసభ పరువును వైకాపా ప్రభుత్వం తీసింది. పోడియం వద్దకు వైకాపా సభ్యులు రావాల్సిన అవసరమేంటి? శాసనసభ చరిత్రలో ఇది చీకటి రోజు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారనే ఆందోళన వైకాపాలో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఓటమి నుంచి దృష్టి మళ్లించేందుకే ఆ పార్టీ నేతలు ఈ విధంగా దాడి చేశారు’’ అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు