Jairam Ramesh: భారత్‌లో అప్రకటిత ఎమర్జెన్సీ: కాంగ్రెస్‌

దేశంలో భాజపా (BJP) ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తోందని కాంగ్రెస్‌ (Congress) విమర్శించింది. న్యాయవ్యవస్థ (Judiciary)ను కూడా పీఎంవోలో భాగం చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని జైరాం రమేశ్‌ ఆరోపించారు.

Published : 27 Jan 2023 22:18 IST

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (Modi) నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ (Undeclared Emergency)ని అమలు చేస్తోందని కాంగ్రెస్‌ (Congress) ఆరోపించింది. న్యాయ వ్యవస్థ (Judiciary)ను కూడా పీఎంవోలో భాగం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించింది. జమ్ముకశ్మీర్‌ ప్రాంతంలో ప్రతిపక్ష పార్టీ నేత పాదయాత్ర చేస్తుంటే ప్రభుత్వం భద్రత కల్పించలేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. భాజపా నాయకత్వంలో దేశంలో ఇంతటి భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ జైరాం రమేశ్‌ (Jairam Ramesh) ఆరోపించారు.

దిల్లీలో జైరాం రమేశ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. భారత్‌ జోడో యాత్రను అడ్డుకునేందుకు ప్రారంభం నుంచి కమళ దళం ప్రయత్నిస్తూనే ఉందని విమర్శించారు. ‘‘దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. కేవలం ఒకే ఒక వ్యక్తి దేశాన్ని పాలిస్తున్నారు. ఆయన చెప్పిందే వేదం. పార్లమెంట్ నిర్ణయాలకు కూడా విలువలేదు. పార్లమెంట్‌లో చర్చలకు తావు లేకుండా ప్రవర్తిస్తున్నారు’’ అని జైరాం రమేశ్‌ ఆరోపించారు. భారత్‌ - చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను గురించి చర్చించాలని దాదాపు రెండున్నేళ్ల నుంచి డిమాండ్‌ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదన్నారు.

భాజపా నేతలు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారని, రాజ్యాంగ వ్యవస్థల్ని బలహీన పరుస్తున్నారని జైరాం రమేశ్‌ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా భారత ప్రజలను ఏకం చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్‌ జోడో యాత్రకు పిలుపునిచ్చిందని తెలిపారు. ఎన్నికల వ్యూహానికి, యాత్రకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. భారతదేశ అభివృద్ధికి భాజపా, ఆరెస్సెస్‌ ‘ఒకే వ్యక్తి.. ఒకే వ్యవస్థ’ సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నాయని... కాంగ్రెస్‌ గాంధేయ మార్గంలో పయనిస్తూ దేశాన్ని అభివృద్ధి చేస్తుందని తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు