Ayyanna Patrudu: ఏపీ శాసనసభాపతిగా అయ్యన్నపాత్రుడు

ఆంధ్రప్రదేశ్‌ 16వ శాసనసభాపతిగా సీనియర్‌ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Updated : 22 Jun 2024 14:51 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ 16వ శాసనసభాపతిగా సీనియర్‌ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సభాపతి స్థానంలో కూర్చుండబెట్టారు. శుక్రవారం సాయంత్రం 5గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఒకే నామినేషన్‌ దాఖలైనందున అయ్యన్నపాత్రుడి ఎన్నిక ఏకగ్రీవమైంది. 

అనుభవానికి ప్రత్యేక గౌరవం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అయ్యన్నపాత్రుడుకి నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. 1983లో తెదేపా ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ఒకసారి ఎంపీగా పనిచేశారు. పదిసార్లు నర్సీపట్నం నుంచి పోటీచేసి ఏడుసార్లు గెలిచారు. ఇప్పటివరకూ ఐదు ప్రభుత్వాల్లో సాంకేతిక విద్య-క్రీడలు, రహదారులు-భవనాలు (రెండు సార్లు), అటవీ, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రిగా పనిచేసిన అనుభవమూ ఆయనకు ఉంది.

‘ఈటీవీ’పై ఉన్న ఆంక్షలు రద్దు చేస్తూ తొలి సంతకం..

అసెంబ్లీలోని స్పీకర్‌ కార్యాలయంలో ప్రత్యే పూజలు నిర్వహించిన అనంతరం సభాపతి అయ్యన్నపాత్రుడు బాధ్యతలు తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ‘ఈటీవీ’కి అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన నిబంధనల దస్త్రాన్ని కొట్టివేస్తూ అయ్యన్నపాత్రుడు తొలి సంతకం చేశారు. ఈటీవీని సభలోకి రావొద్దని పిచ్చి నిర్ణయం ఎవరు తీసుకున్నారంటూ అసెంబ్లీ కార్యదర్శిని ఆయన నిలదీశారు. ఈటీవీ, ఇతర ఛానెళ్లపై ఉన్న ఆంక్షలు తొలగించాలంటూ స్పీకర్‌కు తెదేపా సీనియర్‌నేత ధూళిపాళ్ల నరేంద్ర లేఖ ఇచ్చారు. తక్షణమే ఆంక్షలు సడలిస్తూ సభాపతి లేఖ ఇచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని