Ayyannapatrudu: సభాపతిగా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం

రాష్ట్ర 16వ శాసనసభాపతిగా సీనియర్‌ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Published : 22 Jun 2024 05:59 IST

నేడు అధికారిక ప్రకటన
అనంతరం బాధ్యతల స్వీకరణ
పదవి గౌరవానికి భంగం వాటిల్లకుండా వ్యవహరిస్తా: అయ్యన్నపాత్రుడు
సభాపతిని కుర్చీలో కూర్చోబెట్టే కార్యక్రమానికి జగన్‌ దూరం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర 16వ శాసనసభాపతిగా సీనియర్‌ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభలో అధికారికంగా ప్రకటించనున్నారు. అయ్యన్నపాత్రుడి నామినేషన్‌ను ఆయన తరఫున కూటమి నేతలు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ మంత్రులు అచ్చెన్నాయుడు, నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్‌ అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ రామాచార్యులుకు శుక్రవారం అందజేశారు. శుక్రవారం సాయంత్రం 5గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఒకే నామినేషన్‌ దాఖలైనందున అయ్యన్నపాత్రుడి ఎన్నిక ఏకగ్రీవమైంది. 

అనుభవానికి ప్రత్యేక గౌరవం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అయ్యన్నపాత్రుడుకి నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. 1983లో తెదేపా ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ఒకసారి ఎంపీగా పనిచేశారు. పదిసార్లు నర్సీపట్నం నుంచి పోటీచేసి ఏడుసార్లు గెలిచారు. ఇప్పటివరకూ ఐదు ప్రభుత్వాల్లో సాంకేతిక విద్య-క్రీడలు, రహదారులు-భవనాలు (రెండు సార్లు), అటవీ, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రిగా పనిచేసిన అనుభవమూ ఆయనకు ఉంది.

శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడిని ప్రతిపాదిస్తూ ఆయన తరఫున నామినేషన్‌ దాఖలు చేస్తున్న మంత్రులు
సత్యకుమార్, లోకేశ్, పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు

ప్రతిపక్ష సభ్యులకు అవకాశం ఇస్తా.. అవసరమైతే శిక్షణనిస్తాం: అయ్యన్నపాత్రుడు

శాసనసభాపతిగా నామినేషన్‌ వేసిన తర్వాత అయ్యన్నపాత్రుడు తనను కలిసిన విలేకర్లతో మాట్లాడారు. ‘చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, భాజపా నేతలు నన్ను శాసనసభాపతిగా ప్రతిపాదించారు. 1983 నుంచి సుమారు 42 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. ఐదుసార్లు మంత్రిగా, ఒకసారి ఎంపీగా పనిచేశా. ఇప్పుడు రాజకీయ జీవితంలో దాదాపు ఆఖరు దశలో గౌరవప్రదమైన పదవి వస్తోంది. ఆ పదవి గౌరవానికి భంగం కలగకుండా నేనూ వ్యవహరిస్తా. ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత పార్టీ గుర్తుకు రాదనేది నా భావన’ అని తెలిపారు. ప్రతిపక్ష సభ్యులను ఎలా చూస్తారని విలేకరులు అడగ్గా.. ‘వారికి ప్రతిపక్ష హోదా లేదు కదా? అయినా వారు మాట్లాడతామంటే అవకాశం ఇస్తా, అవసరమైతే వారికి శిక్షణ ఇస్తాం. ప్రజలు మాకు ఇచ్చింది పదవి కాదు, బాధ్యత. దాన్ని అంతే బాధ్యతగా నిర్వర్తిస్తాం. అందులో అనుమానం అవసరం లేదు’ అని అయ్యన్నపాత్రుడు సమాధానమిచ్చారు.

అసెంబ్లీకి నేడు జగన్‌ దూరం

శాసనసభాపతిగా అయ్యన్నపాత్రుడి ఎన్నికను శనివారం సభలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించారు. శుక్రవారం శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన ఆయన.. సభా సంప్రదాయాలను పాటిస్తానని చేసిన ప్రమాణాన్నీ పట్టించుకోకుండా సభాపతి ఎన్నిక సమయంలో సభకు రాకుండా ఉండేందుకే సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష సభ్యులు కలిసి నూతన సభాపతిని ఆయన కుర్చీలో కూర్చోబెట్టి అభినందనలు తెలియజేయడం ఇప్పటివరకూ వస్తున్న సంప్రదాయం. కానీ జగన్‌ అసలు సభకే రాకూడదని నిర్ణయించారు. శనివారం ఆయన పులివెందుల పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. శనివారం నుంచి మూడు రోజులపాటు ఆయన పులివెందులలోనే ఉండనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని