మళ్లీ ఎన్నికల బరిలోకి బబితా ఫొగాట్‌!

ప్రముఖ రెజ్లింగ్‌ ఛాంపియన్‌ బబితా ఫొగాట్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. హరియాణా క్రీడా శాఖలో తన డిప్యూటీ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేశారు. అనివార్య పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం క్రీడా శాఖకు సమర్పించిన రాజీనామా లేఖలో ఆమె పేర్కొన్నారు.

Published : 08 Oct 2020 01:49 IST

చండీగఢ్‌: ప్రముఖ రెజ్లింగ్‌ ఛాంపియన్‌ బబితా ఫొగాట్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. హరియాణా క్రీడా శాఖలో తన డిప్యూటీ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేశారు. అనివార్య పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం క్రీడా శాఖకు సమర్పించిన రాజీనామా లేఖలో ఆమె పేర్కొన్నారు. రాజీనామా అనంతరం బబిత మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను ఇటీవల రాష్ట్ర క్రీడా విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా చేరాను. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల పదవికి రాజీనామా చేశాను. ఇక నుంచి భాజపా తరపున రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలనుకుంటున్నాను. బరోడా నియోజకవర్గంలో రాబోయే ఉపఎన్నికల్లో ప్రచారంలోనూ పాల్గొంటాను’ అని వెల్లడించారు. హరియాణాలోని బరోడా నియోజకవర్గానికి నవంబర్‌ 3న జరగనున్న ఉపఎన్నికకు భాజపా తరపున బబిత పోటీ చేయనున్నట్లు అక్కడ ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు ఆమె బుధవారం హరియాణా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌తో సమావేశం అయ్యారు. 

బబితా ఫొగాట్‌ గతేడాది ఆగస్టులో తన తండ్రితో కలిసి భాజపాలో చేరిన విషయం తెలిసిందే. పార్టీలో చేరిక సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీకి తాను పెద్ద అభిమానినని చెప్పారు. దేశం కోసం కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు, పథకాలు నచ్చి భాజపాలో చేరుతున్నట్లు వెల్లడించారు. హరియాణాలో చివరి శాసనసభ ఎన్నికల్లో దాద్రి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని