Babul Supriyo: బెంగాల్‌లో భాజపాకు షాక్‌.. తృణమూల్‌ గూటికి బాబుల్‌ సుప్రియో

Babul supriyo: పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి మరో షాక్‌ తగలింది. ఆ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి బాబుల్‌ సుప్రియో పార్టీని వీడి తృణమూల్‌ కాంగ్రెస్‌ గూటికి చేరారు.

Updated : 18 Sep 2021 16:34 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి మరో షాక్‌ తగలింది. ఆ పార్టీ సిట్టింగ్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి, బాబుల్‌ సుప్రియో పార్టీని వీడి తృణమూల్‌ కాంగ్రెస్‌ గూటికి చేరారు. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ సమక్షంలో శనివారం పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీలోకి బాబుల్‌ను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంటూ పార్టీలో చేరిన చిత్రాలను తృణమూల్‌ కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది.

అసన్‌సోల్‌ ఎంపీ అయిన బాబుల్‌ సుప్రియో గతంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఆయనను పదవి నుంచి తప్పించారు. అక్కడికి కొద్దిరోజులకే పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. అప్పట్లోనే తృణమూల్‌లో చేరుతారన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే, రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండబోనని తర్వాత ప్రకటించారు. రాష్ట్రంలో భవానీపూర్‌ సహా మూడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భాజపా స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో బాబుల్‌ పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలో భాజపాకు గుడ్‌ బై చెప్పడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇప్పటికే ముకుల్‌ రాయ్‌ సహా పలువురు భాజపా నేతలు తృణమూల్‌లో చేరారు. ఇప్పుడు బాబుల్‌ రూపంలో మరో కీలక నేత సైతం భాజపాను వీడడం ఆ పార్టీకి ఓ విధంగా దెబ్బేనని చెప్పాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని