Babul Supriyo: బెంగాలీలపై ప్రధానికి నమ్మకం లేదు.. బాబుల్‌ సుప్రియో విమర్శలు

భాజపాను వీడి కొద్దిరోజుల క్రితమే తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్‌ సుప్రియో.. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు.....

Published : 30 Sep 2021 01:21 IST

దిల్లీ: భాజపాను వీడి కొద్దిరోజుల క్రితమే తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్‌ సుప్రియో.. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. బెంగాలీలపై మోదీకి నమ్మకం లేదని, బెంగాల్‌ ప్రజలతో ఆయన మంచి సంబంధాలు కొనసాగించలేకపోతున్నారని పేర్కొన్నారు. ‘కేంద్ర మంత్రిగా ఏడెనిమిది ఏళ్లు దిల్లీలో ఉన్న సమయంలో నాకు తెలిసొచ్చిన విషయం ఏమిటంటే.. ప్రధానమంత్రికి బెంగాలీలపై నమ్మకం లేదు. వారితో స్నేహపూర్వక సంబంధాలను కూడా కొనసాగించడంలేదు’ అని విమర్శించారు. బెంగాల్‌ నుంచి గెలుపొంది దిల్లీకి వెళ్లేవారిని మోదీ విశ్వసించరని.. ఇది తన ఒక్కడి పరిస్థితి మాత్రమే కాదని, పలువురి సీనియర్ల పరిస్థితి కూడా ఇంతేనని సుప్రియో ఆరోపించారు. అందుకే మమతా బెనర్జీ ఆధ్వర్యంలో బెంగాల్‌ ప్రజలకు సేవ చేసేందుకే టీఎంసీలో చేరినట్లు తెలిపారు.

ప్రముఖ గాయకుడైన బాబుల్‌ సుప్రియో 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు భాజపాలో చేరి అదే ఏడాది పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మోదీ హయంలో తొలిసారి ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేశారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అదే స్థానం నుంచి రెండోసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. రెండోసారి ఆయన కేంద్రమంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే ఇటీవల జరిగిన బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి బాబుల్‌ ఓటమిపాలయ్యారు. కొద్ది రోజుల క్రితం కేబినెట్‌ విస్తరణ జరగ్గా అందులో బాబుల్‌ మంత్రి పదవిని కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయాలకు గుడ్‌ బై చెబుతున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాగా కొద్దిరోజుల క్రితమే తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని