Updated : 28 May 2022 13:20 IST

Balakrishna: ఈ ప్రభుత్వం గుడిని, గుడిలోని లింగాన్నీ మింగే రకం : బాలకృష్ణ

ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో హిందూపురం ఎమ్మెల్యే

తెనాలి: ‘‘ఇప్పుడున్న ప్రభుత్వం గుడిని, గుడిలోని లింగాన్నీ మింగేసే రకం’’ అని తెదేపా నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం తెనాలి పెమ్మసాని థియేటర్‌లో జరిగిన వేడుకల్లో బాలకృష్ణ పాల్గొన్నారు. ఎన్టీఆర్‌కు ఘన నివాళి అర్పించారు. పెమ్మసాని థియేటర్‌లో 365 రోజులపాటు రోజుకొక ఎన్టీఆర్‌ చిత్రం ఉచిత షో ప్రదర్శన చేయనున్నారని, నెలకొకసారి సినీ కార్మికులకు అవార్డులు అందచేయనున్నట్లు బాలయ్య తెలిపారు. అనంతరం ఆయన ప్రసంగించారు.

‘‘నేను దైవంగా భావించే ఆ మహానుభావుడికి శత జయంతి వందనాలు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, ప్రభుత్వ ఉద్యోగం చేసి, సినిమా రంగంలోకి ప్రవేశించి, తిరుగులేని మహానటుడిగా వేలాది మంది హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తెలుగువారికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, ఏ అవసరమున్నా ఆయన ముందుండేవారు. ఆనాడు సీమ ప్రజలు కరవుతో ఇబ్బందిపడుతున్న రోజుల్లో జోలిపట్టిన గొప్ప సంఘసంస్కర్త ఆయన. దివిసీమ ఉప్పెన సమయంలో, దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికుల కోసం నిధి ఏర్పాటు చేయడం.. ఇలా చెప్పుకొంటూ వెళితే తెలుగువారికి ఎప్పుడూ నేనున్నానంటూ ధైర్యాన్ని ఇచ్చిన ఆదర్శమూర్తి ఎన్టీఆర్‌. తెలుగు జాతి విలువపోతున్నప్పుడు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడుతున్న రోజుల్లో బడుగు, బలహీన శ్రామిక వర్గాల కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టి, సింహాలా గర్జించి, మడమతిప్పకుండా పోరాడిన వ్యక్తి. తెలుగు దేశాన్ని స్థాపించి.. ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అని నిరూపించి.. బడుగు, బలహీనులను సైతం అధికార పీఠంపై కూర్చొపెట్టిన మహానుభావుడు తారకరామారావు. రెండు రూపాయాలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేదవాడికి ఇల్లు.. ఇలా ఎన్నో సంస్కరణలు ఆయన పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకువస్తాయి’’ అని బాలకృష్ణ అన్నారు.

అనంతరం అభిమానుల్ని ఉద్దేశిస్తూ..‘‘అందరూ ఆత్మ విమర్శ చేసుకోండి. ఒక్క ఛాన్స్‌ అంటే ఒక్క తప్పిదం చేశారు. ఓటు వేశారు.. అనుభవిస్తున్నారు. ఇకనైనా ఆత్మ విమర్శ చేసుకోండి. ‘దేశమంటే మట్టి కాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌’ అని అన్నారు గురజాడ. కానీ దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి. ఒకప్పుడు ఎక్కడో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఇప్పుడున్న ప్రభుత్వం గుడిని, గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగేరకం. కాబట్టి మీరే ఆలోచించుకోండి’’ అని బాలయ్య వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో నటి ప్రభా, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్‌ పాల్గొన్నారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని