TDP: ఎన్టీఆర్‌కు మరణం లేదు.. నిత్యం వెలిగే మహోన్నత దీపం: బాలకృష్ణ

ఎన్టీఆర్‌ పాలనలో ఎన్నో సాహసోపేతమైన పథకాలు ప్రవేశపెట్టారని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ తెలిపారు. ఈ మేరకు పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు.

Updated : 29 Mar 2023 21:20 IST

హైదరాబాద్‌: నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ  స్థాపించి  ఒక రాజకీయ విప్లవం తెచ్చారని.. అందరిలోనూ చైతన్యం తీసుకువచ్చారని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ పాలనలో ఎన్నో సాహసోపేతమైన పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో తెదేపా 41వ ఆవిర్భావ దినోతవ్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘పేదల ఆకలి తెలిసిన వ్యక్తి ఎన్టీఆర్‌. ప్రతి తెలుగు బిడ్డ సగర్వంగా తలఎత్తుకునేలా చేశారు. ప్రజల భవితకు భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్‌ నవజాతికి మార్గదర్శకం.. యువతకు ఆదర్శం. ఎన్టీఆర్‌కు మరణం లేదు.. నిత్యం వెలిగే మహోన్నత దీపం’’ అని అన్నారు.

ఎన్టీఆర్ వర్సిటీ పేరును మార్చడం దౌర్భాగ్యం..

ఇళ్లు లేని వారికి పక్కా ఇళ్ల పథకం ఎన్టీఆర్‌ తీసుకువచ్చారని బాలకృష్ణ గుర్తుచేశారు. పటేల్‌ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి సామాజిక సంస్కరణలు తెచ్చారన్నారు. ప్రజల వద్దకే పరిపాలనను తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.  మహిళలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. సహకార వ్యవస్థలో సింగల్ విండో విధానం తెచ్చిన నేత ఎన్టీఆర్ అని అన్నారు. గురుకుల విద్యా బోధన, సంక్షేమ హాస్టళ్లు తీసుకువచ్చారని ఆనాటి విషయాలను ప్రజలతో పంచుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తికి గుర్తుగా పెట్టిన ఎన్టీఆర్ వర్సిటీ పేరును వైకాపా ప్రభుత్వం మార్చడం దౌర్భాగ్యమని మండిపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని