Balasaheb Thorat: మహారాష్ట్రలో కాంగ్రెస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌.. పార్టీ పదవికి థోరట్‌ రాజీనామా!

Balasaheb Thorat: మహారాష్ట్ర సీఎల్పీ పదవికి బాలాసాహెబ్‌ థోరట్‌ రాజీనామా చేశారు. దీంతో అంతర్గత విభేదాలు ముదిరినట్లు తెలుస్తోంది.

Published : 07 Feb 2023 18:45 IST

ముంబయి: మహారాష్ట్ర కాంగ్రెస్‌ (Maharashtra Congress)లో అంతర్గత విభేదాలు ముదిరాయి. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే (Nana Patole)తో  పనిచేయలేనని ఇటీవల కీలక నేత బాలాసాహెబ్‌ థోరట్‌ (Balasaheb Thorat) తన అసంతృప్తిని బయటపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పార్టీ శాసనసభాపక్ష నేతగా ఉన్న థోరట్‌ (Balasaheb Thorat) ఆ పదవికి తాజాగా రాజీనామా చేశారు. తన నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని ఆయన పట్టుబట్టినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఫిబ్రవరి 2నే ఆయన తన రాజీనామాను పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపినట్లు సమాచారం. నానా పటోలే (Nana Patole)తో పనిచేయడం కష్టంగా ఉందని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. పార్టీలో కొందరు తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని థోరట్‌ (Balasaheb Thorat) చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో తనపై, తన కుటుంబంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నట్లు ఆయన పార్టీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కీలక నిర్ణయాలపై తనని సంప్రదించడం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. పరోక్షంగా ఆయన పటోలేని ఉద్దేశించే ఈ ఆరోపణలు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

దీనిపై పటోలే స్పందించారు. తాను ఎవరి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నించలేదని చెప్పారు. థోరట్‌ లేఖలో ఏముందో తెలిసే వరకు తాను ఏమీ మాట్లాడలేనన్నారు. మహారాష్ట్రలో ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి.  పార్టీ తరఫున బరిలో దిగేందుకు అప్పటి నాశిక్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ సుధీర్‌ తాంబే నిరాకరించారు. తర్వాత ఆయన తన తనయుడు సత్యజిత్‌ తాంబేను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిపారు. ఫిబ్రవరి 2న వచ్చిన ఫలితాల్లో సత్యజిత్‌ విజయం సాధించారు. సుధీర్‌ తాంబే, థోరట్‌ సమీప బంధువులు. ఈ నేపథ్యంలో తాంబేకు థోరట్‌ మద్దతు ఉందన్న ఆరోపణలు వచ్చాయి. భాజపాతో చేతులు కలిపి థోరట్‌ కుటుంబం ఇలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని పార్టీలో ఆరోపణలు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని