Bandi sanjay: ఆ ఎమ్మెల్యేల నుంచి సొమ్ము రికవరీ చేసే దమ్ముందా?: బండి సంజయ్‌

భారాస ఎమ్మెల్యేలు, మంత్రులు దళిత బంధులో 30శాతం కమిషన్ తీసుకున్నారని సీఎం కేసీఆర్‌ చెబుతున్నారని.. వారి నుంచి సొమ్మును రికవరీ చేసే దమ్ముందా? అని రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు.

Published : 30 Apr 2023 16:42 IST

హైదరాబాద్‌: కల్వకుంట్ల కుటుంబం ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకు కుట్ర చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఆర్టీసీ సంస్థకు చెందిన విలువైన ఆస్తులను భారాస ఎమ్మెల్యేలకు లీజు పేరిట దోచిపెడుతున్నారన్నారు. సంస్థను వ్యూహాత్మకంగానే దివాలా తీయిస్తున్నారని ధ్వజమెత్తారు. భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో కాచిగూడలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

భారాస ప్రభుత్వం ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సంజయ్‌ విమర్శించారు. తెలంగాణ ఉద్యమం నాటి తెగువను చూపాలని.. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేదాకా పోరాడాలని కార్మికులకు ఆయన పిలుపునిచ్చారు. సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగులంతా ఏకమై పోరాడాలని తెలిపారు. మరో ఐదు నెలల్లో రాబోయేది భాజపా ప్రభుత్వమేనని సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక తొలగించిన ఉద్యోగులందర్నీ విధుల్లోకి తీసుకుంటామని.. బడ్జెట్‌లో ఆర్టీసీకి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

‘‘ఉచిత కరెంటు ఇస్తున్నావు మంచిదే.. డిస్కంలకు కట్టాల్సిన డబ్బులు ఎందుకు కట్టడం లేదు? డిస్కంలు రూ. 60వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. ఆర్టీసి కార్మికులు భయపడుతూ బతకకండి. భయపడితే మరింత భయపెడతారు. మీరు తలుచుకుంటే ప్రభుత్వం పని ఖతమవుతుంది. సింగరేణి కేసీఆర్ కుటుంబానికి ఏటీఏంలా తయారైంది. భారాస ఎమ్మెల్యేలు, మంత్రులు దళిత బంధులో 30శాతం కమిషన్ తీసుకున్నారని సీఎం చెబుతున్నారు. దీన్ని బట్టే కేసీఆర్‌ పాలన ఎలా ఉందో అర్థమవుతోంది. కమిషన్ తీసుకున్న ఎమ్మెల్యేల దగ్గర నుంచి డబ్బును రికవరీ చేసే దమ్ముందా?’’ అని రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని