Bandi Sanjay: తెరాస ప్రభుత్వం బీసీలను అణచివేస్తోంది: బండి సంజయ్‌

తెరాస ప్రభుత్వం 50శాతానికి పైగా ఉన్న బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణిచివేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

Published : 10 Aug 2022 15:05 IST

నకిరేకల్‌: తెరాస ప్రభుత్వం 50శాతానికి పైగా ఉన్న బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణిచివేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. బీసీల సంక్షేమానికి బడ్జెట్‌లో నామమాత్రంగా నిధులు కేటాయిస్తూ.. వాటిలోనూ 10శాతం కూడా ఖర్చు పెట్టడం లేదని మండిపడ్డారు. ఈ అంశంపై ఆర్‌టీఐ ద్వారా సేకరించిన సమాచారాన్ని పరిశీలిస్తే అనేక అంశాలు తేటతెల్లమవుతున్నాయని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 

బీసీ సబ్‌ ప్లాన్ తెస్తామని 2017 బడ్జెట్‌ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు దానికి అతీగతీ లేదని బండి సంజయ్‌ దుయ్యబట్టారు. 2017లో ఏర్పాటు చేసిన ఎంబీసీ కార్పోరేషన్‌కు గత నాలుగు బడ్జెట్‌లలో రూ.3వేల కోట్లు కేటాయించినట్లు కాగితాల్లో కనిపిస్తున్నా ఖర్చు చేసింది రూ.10కోట్లకు మించలేదని ఆరోపించారు. గొల్లకురుమల కోసం ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం మూలపడి మూడేళ్లయిందన్నారు. ఇదే మాదిరిగా ఇతర బీసీ సామాజిక వర్గాలకు కూడా అన్యాయమే జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో సగానికి పైగా బీసీ జనాభా ఉంటే.. అసెంబ్లీలో కేవలం 22 మంది సభ్యులు, మంత్రి వర్గంలో కేవలం ముగ్గురు మంత్రులు మాత్రమే ఉన్నారని ఆక్షేపించారు.

మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో బండి సంజయ్‌ ‘ప్రజాసంగ్రామ పాదయాత్ర’ కొనసాగుతోంది. నకిరేకల్‌ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన.. స్థానికులతో మాట్లాడుతూ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. సుంకెనాపల్లి నుంచి చిట్టెడుగూడెం మీదుగా యాత్ర సాగుతోంది. మార్గంమధ్యలో కల్లుగీత కార్మికుల సమస్యలను సంజయ్‌ తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని