Bandi Sanjay: ఏపీలో గత పాలకులు వీరప్పన్‌ వారసులు: కేంద్రమంత్రి బండి సంజయ్‌

శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

Updated : 11 Jul 2024 11:33 IST

తిరుమల: శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చిందని చెప్పారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘ ఏపీలో గత వైకాపా ప్రభుత్వ పాలకులు వీరప్పన్‌ వారసులు. ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను దోచుకున్నారు. ఆ డబ్బుతో రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. ఎర్రచందనం దొంగలను వదిలిపెట్టేదే లేదు. గత అరాచక ప్రభుత్వంలో స్వామివారి నిధులను పక్కదారి పట్టించి తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు.

శేషాచలం కొండల్లో ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరతాం. దాని ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటాం. ఎర్రచందనం అక్రమ రవాణాపై గతంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌, తిరుపతి భాజపా నాయకులు అనేక పోరాటాలు చేశారు. కొండ మీద అరాచక పాలన ముగిసింది. ఇన్నాళ్లు భక్తులు ఎదుర్కొన్న సమస్యలు తొలగి పరిస్థితులు చక్కబడ్డాయి. స్వామివారి ఆస్తుల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటాం. నరేంద్ర మోదీ దేశాన్ని విశ్వగురువుగా చేసేందుకు కృషి చేస్తున్నారు. ఆయన సారథ్యంలో భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారుతోంది’’ అని బండి సంజయ్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని