BJP: సీఎం కుమార్తె వాచ్‌కు ఉన్న విలువ వైద్య విద్యార్థిని ప్రాణానికి లేదు: బండి సంజయ్‌

వైద్య విద్యార్థిని ప్రీతి కేసులో నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రీతి మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపించడానికి సీఎంకు అభ్యంతరమేంటని ఆయన ప్రశ్నించారు.

Updated : 24 Mar 2023 15:35 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలనలో మహిళలకు రక్షణ కరవైందని భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi sanjay) విమర్శించారు. భారాస (BRS) పాలనలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలోని మహిళలపై జరుగుతోన్న అత్యాచారాలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయన నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌.. సంజయ్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

అంతకు ముందు బండి సంజయ్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కుమార్తె చేతికి ఉన్న వాచ్ విలువ వైద్య విద్యార్థి ప్రాణానికి లేదని విమర్శించారు. సీఎం కుమార్తె చేతికి రూ.25 లక్షల విలువైన వాచ్‌ను వాడుతున్నారని.. వైద్య విద్యార్థిని ప్రీతి మరణిస్తే రూ. 10లక్షలు ఆర్థిక సాయం మాత్రమే అందజేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీతి కేసులో నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని సంజయ్‌ ఆరోపించారు. శవానికి ట్రీట్‌మెంట్ చేస్తూ సినిమా చూపించారన్నారు. ప్రీతి సెల్‌ఫోన్‌లోని డేటా మొత్తం డిలీట్ చేశారన్న సంజయ్‌.. ఆమె ఎలా చనిపోయిందో ఇప్పటివరకూ స్పష్టత లేదన్నారు. ప్రీతిని తమ కుటుంబసభ్యులు చివరి చూపు చూసుకోకుండా ఆదరా బాదరాగా అంత్యక్రియలు చేశారన్నారు. ప్రీతి మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడానికి సీఎం కేసీఆర్‌కు అభ్యంతరమేంటి? అని ప్రశ్నించారు.

కేసీఆర్ అవినీతిపై కోటి మందితో సంతకాలు సేకరిస్తాం..

అనంతరం బండి సంజయ్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సిసోదియా అరెస్టును ఖండిస్తూ ఆదివారం నలుగురు సీఎంలు, విపక్షనేతలు ప్రధాని మోదీకి లేఖ రాయడంపై ఆయన స్పందిస్తూ.. కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. సంతకాల్లేకుండా ప్రధానికి లేఖ రాయడమేంటని ప్రశ్నించారు. ‘‘దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కుమార్తెను అరెస్టు చేస్తారనే భయంతోనే సీఎం కేసీఆర్‌ కొత్త డ్రామాకు తెరలేపారు. కుమార్తెపై ఆరోపణలోస్తే స్పందించకుండా సిసోదియా అరెస్ట్‌ను ఖండించడం వెనుకనున్న మతలబు ఇదే. సీఎంగా ఉంటూ ఇంత నీచ స్థాయికి దిగజారడం అవసరమా? ప్రధాని మోదీని బదనాం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారు. నువ్వు మందితో కలిసి లేఖ రాస్తే.. నీ అవినీతిపై కోటి మందితో సంతకాలు సేకరిస్తాం. త్వరలోనే రాష్ట్రపతిని కలిసే అంశాన్ని పరిశీలిస్తున్నాం’’ అని సంజయ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని