TS News: సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మహోద్యమమే: బండి సంజయ్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు. రైతాంగ ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తోందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి..

Published : 14 Jan 2022 01:35 IST

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు. రైతాంగ ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తోందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేసీఆర్‌ రాసిన లేఖ పచ్చి అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని లేఖలో పేర్కొన్నారు. 317 జీవోను సవరించాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన, రాష్ట్రంలో ఉన్న 2లక్షల ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని నిరుద్యోగుల పక్షాన మహోద్యమానికి శ్రీకారం చుడుతుంటే వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రధానమంత్రికి బహిరంగ లేఖ పేరిట కొత్త డ్రామాకు తెరతీసినట్లు కనిపిస్తోందిన లేఖలో పేర్కొన్నారు. 

కేసీఆర్‌ అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ఆనందంగా సంక్రాంతి పండుగ చేసుకోవాల్సిన రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు నేడు కన్నీళ్లతో సకినాల పిండిని తడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. అయినా, చేసిన తప్పిదాలను సరిదిద్దుకోకుండా ఎదురుదాడి చేస్తూ రాజకీయ డ్రామాలు చేస్తున్నందున వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మీరు లేవనెత్తిన అంశాలపై స్పందిస్తూ బహిరంగ లేఖ రాసినట్టు చెప్పారు. 2017 ఏప్రిల్‌ 13న మీరిచ్చిన హామీ మేరకు రాష్ట్ర రైతాంగానికి ఉచితంగా ఎరువులు సరఫరా చేయాలి, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని లేఖలో డిమాండ్‌ చేశారు. ధాన్యం, పత్తి, మొక్కజొన్న సహా రాష్ట్రంలో రైతులు పండించే పంట ఉత్పత్తులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌ ప్రకటించాలన్నారు. కేంద్రం కేటాయించిన నిధులను తక్షణమే ఖర్చు చేసి రైతుల పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహించడంతో పాటు పంటల ప్రణాళికను ప్రకటించాలని కోరారు. వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీలను తక్షణమే అమలు చేయాలని, వాటిని పార్టీ కార్యకర్తలకు కాకుండా అర్హులైన రైతులకు మాత్రమే అందించాలన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు పాలీహౌజ్‌ సబ్సిడీని పునరుద్ధరించి... ఎస్సీ, ఎస్టీ రైతులకు అదనపు పాలీహౌజ్‌ల నిర్మాణానికి ప్రోత్సాహకం అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలన్నారు. విత్తన సబ్సిడీని పూర్తిగా అమలు చేసి నకిలీ విత్తనాలను అరికట్టాలని కోరారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని, మార్కెట్లో ఈ-నామ్‌ పద్ధతిని ప్రవేశపెట్టి రైతులకు మేలు చేయాలని పేర్కొన్నారు. బిందు సేద్యంలో భాగంగా ఎస్సీలకు 90 శాతం, బీసీలకు 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ హామీలు, డిమాండ్లన్నింటినీ వచ్చే ఉగాది నాటికి అమలు చేయాలని లేనిపక్షంలో రైతుల పక్షాన మరో మహోద్యమానికి శ్రీకారం చుడతామని బండి సంజయ్‌ హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని