Bandi Sanjay: గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి

తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సోమవారం బహిరంగ లేఖరాశారు.

Published : 09 Jul 2024 04:29 IST

సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ లేఖ

తెలంగాణచౌక్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సోమవారం బహిరంగ లేఖరాశారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రెసిడెన్షియల్‌ పాఠశాలల రోజువారీ షెడ్యూల్‌ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మార్చింది. కొత్త టైంటేబుల్‌ అమలుతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలకు అల్పాహారం, రాత్రి భోజనం, క్రీడలు, వ్యక్తిగత పరిశుభ్రతకు, నిద్రించడానికి తగినంత సమయం దొరకదు. గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు, సిబ్బంది, క్వార్టర్లు లేవు. రోజూ స్టడీ అవర్లు ముగిశాక రాత్రి 9-30 తర్వాత ఇళ్లకు వెళ్లాలంటే ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు ఈ షెడ్యూల్‌తో నరకయాతన అనుభవిస్తున్నారు. వార్డెన్‌ పోస్టులు మంజూరు చేసినా... నియమించకపోవడంతో టీచర్లపై పనిభారం పడుతోంది. తక్షణమే గురుకుల ఉపాధ్యాయులను నాన్‌ టీచింగ్‌ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేయాలి. కరీంనగర్‌ జిల్లాలోని పోలీసులకు నెలల తరబడి టీఏ, డీఏ, పీఆర్సీ బకాయిలతో పాటు సరెండర్‌ లీవుల బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో వెయ్యి మంది పోలీసులకు 7 నెలలుగా టీఏ బిల్లులు ఇవ్వడంలేదు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఈ బకాయిలు చెల్లిస్తున్నా కరీంనగర్‌లో మాత్రం చెల్లించకపోవడం బాధాకరం. తక్షణమే బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని’’ ముఖ్యమంత్రిని సంజయ్‌ లేఖలో కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు