అందుకే కొత్త రాజ్యాంగం కావాలంటున్నారా?: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ ప్రశ్న

దేశాన్ని బాగు చేసేందుకు కొత్త రాజ్యాంగం అవసరం ఉందంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని నిరసిస్తూ దిల్లీలోని తెలంగాణ భవన్‌ నుంచి.......

Published : 04 Feb 2022 20:10 IST

తెలంగాణ భవన్‌ నుంచి పార్లమెంట్‌ వరకు పాదయాత్ర

దిల్లీ: దేశాన్ని బాగు చేసేందుకు కొత్త రాజ్యాంగం అవసరం ఉందంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని నిరసిస్తూ దిల్లీలోని తెలంగాణ భవన్‌ నుంచి పార్లమెంట్‌ వరకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర చేపట్టారు. భాజపా భీమ్‌ పేరుతో నిర్వహించిన ఈ పాదయాత్రలో ఆ పార్టీ ఎంపీలు ధర్మపురి అర్వింద్‌, సోయం బాపురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘రాజ్యాంగంపై కేసీఆర్‌ వ్యాఖ్యలతో తెలంగాణ సమాజం సిగ్గుపడుతోంది. సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టాలని రాజ్యాంగంలో ఉందా? రిటైరైన వాళ్లను సలహాదారులుగా పెట్టుకోవాలని రాజ్యాంగంలో ఉందా? ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకూడదని రాజ్యాంగంలో ఉందా? జీవోలతో ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టాలని రాజ్యాంగంలో ఉందా? ఇవేవీ రాజ్యాంగంలో లేనందునే కొత్తది కావాలంటున్నారా?’’ అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు.. సీఎం కేసీఆర్‌నే అన్నారు. కేసీఆర్‌ పాలన పోవాలి.. ప్రజాస్వామిక తెలంగాణ రావాలన్నారు. కేసీఆర్‌ క్షమాపణలు చెప్పేవరకూ ఆందోళన కొనసాగిస్తామన్నారు. అభినవ అంబేడ్కర్‌ తానేనని పాఠ్యాంశాల్లో చేర్చేందుకు కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని సంజయ్‌ ఆరోపించారు. అవినీతిపై విచారణ భయంతోనే కేసీఆర్‌ ప్రజల్ని రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని