Bandi sanjay: రైతులేం పాపం చేశారు.. కనీసం వాళ్ల అభిప్రాయం తీసుకోరా?: బండి సంజయ్‌

భారాస ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. పంటలు పండే భూములను లాక్కొని వ్యాపారులకు అప్పగించడం దారుణమన్నారు.

Published : 06 Jan 2023 20:00 IST

కామారెడ్డి: భారాస ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్లే రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. పారిశ్రామిక జోన్ కింద భూమి పోతుందని కలత చెంది పయ్యావుల రాములు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. రాములు ఆత్మహత్య తెలంగాణ సమాజాన్ని కలచివేసిందన్నారు. ఆయన కుటుంబాన్ని బండి సంజయ్‌ శుక్రవారం సాయంత్రం పరామర్శించారు. అనంతరం కామారెడ్డి జిల్లా అడ్లురి ఎల్లారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘పయ్యావుల రాములుది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాస్తుంది. పంటలు పండే భూములను రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక జోన్ కోసం లాక్కొని వ్యాపారులకు అప్పగించడం దారుణం. రైతులేం పాపం చేశారు. కనీసం వాళ్ల అభిప్రాయం తీసుకోరా? రైతుల పొట్టకొట్టడమే రహస్య మాస్టర్ ప్లానా? మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 8 గ్రామాల్లో 2,500 ఎకరాలు పోతోంది. రైతుల అభిప్రాయం లేకుండా మాస్టర్‌ ప్లాన్‌ చేయడం సరికాదు. మున్సిపల్‌ తీర్మానం చేసేవరకు రైతులకు వాస్తవాలు చెప్పలేదు. రైతులు ఉద్యమం చేయకుంటే ముసాయిదా ఆమోదించే వారు. కొంత మంది అధికారులు రాజకీయ నాయకులతో కుమ్మక్కయ్యారు. కలెక్టర్‌ తన బాధ్యత నెరవేర్చకపోవడం సరికాదు. రైతు పేరుతో పట్టా ఉంటే కలెక్టర్‌ ఎందుకు జవాబు ఇవ్వట్లేదు. కేటీఆర్ పురపాలక శాఖ మంత్రి కాదు.. రియల్ ఎస్టేట్ మంత్రి. పట్టణాలకు ఎంత బడ్జెట్ ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలి’’ అని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

ప్రశాంతంగా ముగిసిన బంద్‌

పట్టణ బృహత్‌ ప్రణాళికను వ్యతిరేకిస్తూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపుమేరకు కామారెడ్డిలో చేపట్టిన బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. రైతులకు మద్దతుగా కాంగ్రెస్‌, భాజపా నేతలు రోడ్డెక్కడంతో ఎక్కడికక్కడా పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టరేట్‌ వద్ద నిన్నంతా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంద్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం ఇవ్వకుండా పోలీసులు ఎక్కడికక్కడ మోహరించారు. కొంతమంది నేతలను అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని