Bandi Sanjay: కేటీఆర్‌ పరువు ₹100 కోట్లయితే.. యువత భవిష్యత్తుకు మూల్యమెంత?: బండి సంజయ్‌

మంత్రి కేటీఆర్ పంపిన లీగల్‌ నోటీసుపై చట్టపరంగానే ఎదుర్కొంటానని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

Published : 29 Mar 2023 16:53 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో తనపై నిరాధార, అసత్య ఆరోపణలు చేశారని మంత్రి కేటీఆర్ పంపిన లీగల్‌ నోటీసుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందించారు. నోటీసులను తాను చట్టపరంగానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘కేటీఆర్‌ ₹100 కోట్లకు నాపై పరువు నష్టం దావా వేస్తానని లీగల్‌ నోటీసు పంపారు. మంత్రి కేటీఆర్‌ పరువు ₹100 కోట్లా? మరి యువత భవిష్యత్తుకు మూల్యమెంత? పేపర్‌ లీకేజీలో నా కుట్ర ఉందని కేటీఆర్‌ ఆరోపించారు. అలాగైతే కేటీఆర్‌పై నేను ఎన్ని కోట్లకు దావా వేయాలి? పేపర్‌ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి. నష్టపోయిన నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాల్సిందే. కేటీఆర్‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేసేదాకా పోరాడతాం’’ అని బండి సంజయ్‌ ప్రకటనలో పేర్కొన్నారు.

గడీల పాలనతో బీసీలపై ఉక్కుపాదం మోపారు: బూర నర్సయ్య గౌడ్‌

భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పల్లె పల్లెకు ఓబీసీ.. ఇంటింటికీ భాజపా కరపత్రాలను పార్టీ నేతలు బూర నర్సయ్యగౌడ్‌, ఆలె భాస్కర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బూర నర్సయ్యగౌడ్‌ మాట్లాడుతూ.. దేశంలో 50 నుంచి 55శాతం జనాభా ఉన్న బీసీలపై కాంగ్రెస్‌ నుంచి మొదలుకుని కేసీఆర్‌కు వరకు అందరూ వివక్ష చూపారని ఆరోపించారు. తెలంగాణ వచ్చాక గడీల పాలనతో బీసీలపై ఉక్కుపాదం మోపారని విమర్శించారు. మోదీ ప్రధానమంత్రి అయ్యాక.. కేబినెట్‌లో 27శాతం బీసీ మంత్రులు ఉన్నారని వివరించారు. ప్రగతి భవన్‌లో ఒక్క బీసీ అధికారి కూడా లేరని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని