
Ts News: 317 జీవోను సవరించే వరకు కేసీఆర్‌ను వదిలిపెట్టం: బండి సంజయ్
హైదరాబాద్: కరోనాను ఎదుర్కోవడంలో భారతదేశాన్ని ప్రథమ స్థానంలో నిలిపిన ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ ప్రజల తరఫున భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. మన దేశంలోని ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు ఆ స్థాయిలో లేనప్పటికీ కరోనాను విజయవంతంగా ఎదుర్కోగలిగామన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ పెడితే ప్రతిపక్షాలు విమర్శించాయన్నారు. అదే సమయంలో లాక్‌డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడొద్దని అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు.
‘‘317జీవో వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో 317జీవోపై చర్చించకపోవడం దుర్మార్గం. 317 జీవోను సవరించే వరకు కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయులు తల్చుకుంటే గతంలో ప్రభుత్వాలే కూలిపోయాయి. వారికి భాజపా అండగా ఉంటుంది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు మద్దతుగా జాతీయ నాయకులతో వర్చువల్‌గా సభ నిర్వహిస్తాం. నోటిఫికేషన్ల కోసం కమిటీలు వేశామని చెబుతూ సీఎం కేసీఆర్ కాలయాపన చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సిబ్బంది, మౌలిక సదుపాయాలు లేవు. అలాంటప్పుడు ఆంగ్ల మాధ్యమాన్ని ఎలా అమలు చేస్తారు? కార్పొరేట్ పాఠశాలల నుంచి డబ్బులు దోచుకోవడానికే ఈ నాటకం. ఏడేళ్లలో ఒక్క ప్రభుత్వ పాఠశాలనైనా కేసీఆర్ సందర్శించారా?సీఎం ఏది మాట్లాడినా విశ్వాసం లేకుండా పోయింది. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశానికి ఎందుకు హాజరుకాలేదో చెప్పాలి’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.