Bandi Sanjay: ఒక్క రాష్ట్రంలో గెలవగానే కేంద్రంలో అధికారంలోకి వస్తారా?: బండి సంజయ్‌

ఒక్క రాష్ట్రంలో గెలవగానే కేంద్రంలో అధికారంలోకి వస్తారా?అని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు.

Updated : 13 May 2023 18:30 IST

కరీంనగర్‌: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందించారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలోనైనా అక్కడి పరిస్థితుల ప్రభావం ఉంటుందని, కర్ణాటకలో భాజపా ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని చెప్పారు. ఒక రాష్ట్రంలో వచ్చిన ఫలితాల ప్రభావం మరో రాష్ట్రంపై ఉంటుందనుకోవడం సరికాదన్నారు. గత ఎన్నికల్లో భాజపాకు 36 శాతం ఓట్లు వచ్చాయని, ఈసారి కూడా 36శాతం ఓట్లు పోలయ్యాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఓటింగ్‌ 38 నుంచి 43 శాతానికి పెరిగిందన్నారు. జేడీఎస్‌ ఓటింగ్‌ షేర్‌ 20 నుంచి 13శాతానికి తగ్గిందని పేర్కొన్నారు.

‘‘అన్ని పార్టీలు కలిసి భాజపాను ఎదుర్కొన్నాయి. కర్ణాటకలో మత రాజకీయాలు చేసింది కాంగ్రెస్‌ పార్టీయే. ఆ పార్టీకి మద్దతిచ్చిన కేసీఆర్‌.. కర్ణాటకలో పెద్దన్న పాత్ర పోషించారు. కాంగ్రెస్‌ పార్టీ ఒక వర్గం ఓట్లతో గెలిచింది. ఎస్‌డీపీఐ, ఎంఐఎంలు కాంగ్రెస్‌కు సపోర్టు చేశాయి. తెలంగాణలో ఐదు ఉప ఎన్నికలు జరిగితే రెండింటిలో భాజపా గెలిచింది. మునుగోడులోనూ మేమే గెలిచినట్టు లెక్క. కాంగ్రెస్‌కు డిపాజిట్‌ రాలేదు.

జీహెచ్‌ఎంసీలో 4 నుంచి 48 సీట్లకు వచ్చాం. ఒక్క రాష్ట్రంలో గెలవగానే కేంద్రంలో అధికారంలోకి వస్తారా? తెలంగాణలోనూ మా ఓటింగ్‌ శాతం పెరిగింది. కర్ణాటక క్యాంపు రాజకీయాలు సీఎం కేసీఆర్‌ అండతోనే హైదరాబాద్‌లో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావడం ఖాయం. దమ్ముంటే కర్ణాటకలో ప్రకటించినట్లుగా నాలుగు శాతం రిజర్వేషన్‌ సహా, భజరంగ్‌దళ్‌ను నిషేదిస్తామని తెలంగాణలో చెప్పగలరా? కేసీఆర్‌కు తెలియకుండా హైదరాబాద్‌లో క్యాంపు రాజకీయాలు నడుస్తాయా? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, భారాస కలిసి పోటీ చేస్తాయి’’ అని బండి సంజయ్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని