Bandi Sanjay: దేవుడిని మోసం చేసేవారికి గుణపాఠం తప్పదు

దేవుడిని మోసం చేస్తే తగిన శాస్తి తప్పదని, ఇందుకు కేసీఆర్‌ ప్రభుత్వ పతనమే నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ పేర్కొన్నారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని బుధవారం దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Published : 20 Jun 2024 06:32 IST

కేసీఆర్‌ ప్రభుత్వ పతనమే అందుకు నిదర్శనం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌
కరీంనగర్‌లో ఘనస్వాగతం పలికిన పార్టీ నాయకులు

కరీంనగర్‌ ర్యాలీలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌. చిత్రంలో భాజపా నేతలు

కరీంనగర్, ఈనాడు, వేములవాడ, న్యూస్‌టుడే: దేవుడిని మోసం చేస్తే తగిన శాస్తి తప్పదని, ఇందుకు కేసీఆర్‌ ప్రభుత్వ పతనమే నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ పేర్కొన్నారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని బుధవారం దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజన్న ఆలయానికి రూ.400 కోట్లు ఇస్తామని చెప్పి దేవుడికే శఠగోపం పెట్టాలని చూసిన చరిత్ర కేసీఆర్‌ది అని విమర్శించారు. ఈ దేవస్థానాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు.. మంత్రి హోదాలో తొలిసారిగా బుధవారం తన సొంత పట్టణమైన కరీంనగర్‌కు వచ్చిన సంజయ్‌కు నియోజకవర్గం పరిధిలో పలుచోట్ల నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సిద్దిపేట జిల్లా శనిగరం నుంచి కరీంనగర్‌ వరకు భారీ వాహన శ్రేణితో వచ్చిన ఆయనకు కరీంనగర్‌ కలెక్టర్‌ పమేలా సత్పతి సహా ఇతర అధికారులు ప్రభుత్వ అతిథి గృహం వద్ద స్వాగతం పలికారు. కరీంనగర్‌లోని కమాన్‌ చౌరస్తా వద్దకు రాగానే ఆయన వాహనం దిగి రోడ్డుపైన సాష్టాంగ నమస్కారం చేశారు. తరువాత మహాశక్తి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సామాన్య కార్యకర్త కేంద్ర మంత్రి స్థాయికి ఎదగడం ఒక్క భాజపాలోనే సాధ్యమని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి, కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధికి అవసరమైన నిధుల్ని కేంద్రం నుంచి తెచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. కరీంనగర్‌ పట్టణంలో దారిపొడుగునా భాజపా నాయకులు, కార్యకర్తలు సంజయ్‌పై పూల వర్షాన్ని కురిపించి, ‘సెల్యూట్‌ కరీంనగర్, సెల్యూట్‌ సంజయ్‌’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కరీంనగర్‌లోని తన సొంతింటికి వెళ్లి తల్లి శకుంతలకు పాదాభివందనం చేశారు. తరువాత జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి, ఇదే జిల్లా కొడిమ్యాల మండలంలోని నల్లగొండ లక్ష్మీనర్సింహస్వామి, వేములవాడ రాజన్న ఆలయం, సిరిసిల్ల మార్కండేయ ఆలయాలను సందర్శించి పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని