Telangana News: దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోన్న సీఎం కేసీఆర్: బండి సంజయ్‌

తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలే లేనట్లుగా, రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉన్నట్లుగా సీఎం కేసీఆర్ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర చేస్తున్నారని భాజపా రాష్ట్ర ...

Published : 24 May 2022 01:13 IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలే లేనట్లుగా, రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉన్నట్లుగా సీఎం కేసీఆర్ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ, పంజాబ్‌ వెళ్లి దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రసంగాలు చేస్తున్నారని ఆక్షేపించారు. అబద్ధాలను నిజాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వ్యవహార శైలి విషయంలో జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలు, రాష్ట్ర నాయకులంతా ఎక్కడికక్కడ సీఎం తీరును ఎండగట్టాలని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని పిలుపునిచ్చారు.

‘‘రాష్ట్రంలో ఇటీవల 3 బహిరంగ సభలు జరిగాయి. అందులో తెరాస ప్లీనరీ, రాహుల్ గాంధీ సభ, ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలు ప్రధానమైనవి. ఈ మూడు సభలను చూసిన ప్రజలు ఎప్పుడు ఎన్నికలు జరిగినా భాజపా అధికారంలోకి రావడం ఖాయమని భావిస్తున్నారు. ఇటీవల మూడు ప్రముఖ సర్వే సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహిస్తే ఇదే విషయం వెల్లడైంది. ఆ నివేదికలో తెరాస, కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా ఉంది. భాజపా గ్రాఫ్ విపరీతంగా పెరిగినట్లు తేలింది.

పెట్రోలు, డీజిల్, గ్యాస్‌ ధరలను కేంద్రం తగ్గించిన నేపథ్యంలో పార్టీ నేతలంతా తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించి ప్రజలకు తక్కువ ధరకు పెట్రోలు, డీజిల్ అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలు మరింత యాక్టివ్‌గా పనిచేయాలి. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తక్షణమే స్పందిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలి’’ అని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని