Bandi sanjay: పేపర్‌ లీకేజీకి మంత్రి కేటీఆర్‌ నిర్వాకమే కారణం: బండి సంజయ్‌

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారాన్ని వదిలిపెట్టబోమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ఉద్యమాన్ని ఇంకా ఉద్ధృతం చేసి.. నష్టపోయిన నిరుద్యోగ యువతకు అండగా ఉంటామన్నారు.

Updated : 25 Mar 2023 16:05 IST

హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) పేపర్‌ లీకేజీకి మంత్రి కేటీఆర్‌ నిర్వాకమే కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి  సీఎం కేసీఆర్‌ మాట్లాడటం లేదని.. సీఎం కుమారుడు (కేటీఆర్‌) మాత్రమే స్పందిస్తున్నారని ఆయన విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీని నిరసిస్తూ ఇందిరాపార్కు వద్ద భాజపా చేపట్టిన ‘మా నౌకరీలు మాగ్గావాలే’ దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. 

పేపర్‌ లీకేజీ వ్యవహారంలో భారాస నేతలకు నోటీసులు ఇచ్చే ధైర్యం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)కు లేదని బండి సంజయ్‌ అన్నారు. నయీం కేసులో వేసిన సిట్‌ ఏమైందో సీఎం కేసీఆర్‌ చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్‌ చేశారు. డ్రగ్స్‌ కేసు, మియాపూర్‌ భూములపై వేసిన సిట్‌ ఏమైందో చెప్పాలన్నారు. లీకేజీ కేసులో పెద్దపెద్ద వాళ్లను వదిలేసి చిన్నవాళ్లను అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. ప్రశ్నపత్రాలు లీక్‌ అవ్వటం సర్వసాధారణమే అన్న భారాస మంత్రికి నోటీసు ఎందుకు ఇవ్వడం లేదని సంజయ్‌ ప్రశ్నించారు. 

10 ఉమ్మడి జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్‌..

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్‌ తేల్చి చెప్పారు. ఉద్యమాన్ని ఇంకా ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. తప్పకుండా కేటీఆర్‌ రాజీనామా చేయాలని... 30లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పేపర్‌ లీకేజీ కేసును సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. పరీక్షలు రాసి నష్టపోయిన యువతకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష భృతి ఇవ్వాల్సిందేనన్నారు. భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సీహెచ్‌ విఠల్‌ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ వేస్తామని చెప్పారు. రేపట్నుంచి అన్ని యూనివర్సిటీలు తిరిగి విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకుంటామని తెలిపారు. వాస్తవ విషయాలను సమీకరించే ప్రయత్నాలు చేస్తామన్నారు. ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు 10 ఉమ్మడి జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్‌ను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి గడీలు బద్దలయ్యే విధంగా రాష్ట్రంలో నిరుద్యోగ మార్చ్‌ను చేపడతామని బండి సంజయ్‌ ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని