Bandi Sanjay: నిజాం సమాధి వద్ద మోకరిల్లే వారికి ఈ గడ్డపై స్థానం లేదు: బండి సంజయ్‌

తెలంగాణలో అధికార మార్పు జరగాలని ప్రజలంతా భావిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Updated : 14 May 2022 20:38 IST

హైదరాబాద్‌: తెలంగాణలో అధికార మార్పు జరగాలని ప్రజలంతా భావిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన భాజపా భారీ బహిరంగసభలో సంజయ్‌ మాట్లాడారు. కేసీఆర్‌ కుటుంబ పాలనను అంతం చేసేందుకే కేంద్రహోంమంత్రి అమిత్‌షా వచ్చారన్నారు.

‘‘పాదయాత్రలో ప్రజలు ఎన్నో సమస్యలను నాకు మొరపెట్టుకున్నారు. ధరణి పేరుతో ప్రజల భూములను తెరాస నేతలు లాక్కున్నారు. కుటుంబపాలన వల్ల శ్రీలంకలో వచ్చిన పరిస్థితులు చూశాం. ప్రభుత్వంలోని కీలక శాఖలన్నీ కేసీఆర్‌, కుటుంబసభ్యుల వద్దే ఉన్నాయి. పాలమూరు ప్రజలు ఇంకా ఎడారి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఆర్డీఎస్‌ను పూర్తిచేసే బాధ్యత మాదే. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తామని చెప్పిన కేసీఆర్‌ అలా ఇచ్చారా?

కేసీఆర్‌ ఒకసారి వరి వద్దంటారు.. మరోసారి పత్తి వద్దంటారు. తుగ్లక్‌ నిర్ణయాలతో తెలంగాణ రైతాంగాన్ని సీఎం ఇబ్బంది పెడుతున్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో సమస్యలు చెప్పుకుంటూ ప్రజలు ఏడ్చారు. నాకు బాధలు చెప్పుకొన్నారు. 18వేల అర్జీలు వస్తే.. అందులో 60 శాతం ఇళ్లులేని పేదోళ్లవే. మోదీ ఆలోచన మేరకు పేదవాళ్ల కోరికలు నెరవేరాలంటే రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడాలి. అధికారంలోకి వస్తే నిలువ నీడలేని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రధాని ఆవాస్‌ యోజన కింద ఇళ్లు నిర్మిస్తాం. నిరుద్యోగులకు ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తాం. రాష్ట్రంలో వ్యాట్‌ సవరించి పెట్రోల్‌, డీజిల్‌ రేటు తగ్గిస్తాం. ఫసల్‌ బీమా యోజనతో రైతాంగాన్ని ఆదుకుంటాం. ఉచిత విద్య, ఉచిత వైద్యం హామీలను కచ్చితంగా నెరవేర్చుకుంటాం. తెరాస, ఎంఐఎం, కాంగ్రెస్‌ నాటకాలు ఆడుతున్నాయి. కాంగ్రెస్‌కు ఓటేస్తే తెరాసకు వేసినట్లే. నిజాం సమాధి వద్ద మోకరిల్లే వారికి ఈ గడ్డపై స్థానం లేదు’’ అని సంజయ్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని