TS News: జనవరిలోగా జాబ్‌ నోటిఫికేషన్‌ ఇవ్వకపోతే..: బండి సంజయ్‌ హెచ్చరిక

తమ పార్టీ చేపట్టిన నిరుద్యోగ దీక్షను సీఎం కేసీఆర్‌ అడ్డుకొంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. తమ పార్టీ దీక్షతో ప్రభుత్వానికి వణుకు

Updated : 27 Dec 2021 16:40 IST

హైదరాబాద్‌: తమ పార్టీ చేపట్టిన నిరుద్యోగ దీక్షను సీఎం కేసీఆర్‌ అడ్డుకొంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. తమ పార్టీ దీక్షతో ప్రభుత్వానికి వణుకు పుట్టిందన్నారు. రాత్రికి రాత్రే ర్యాలీలు, సభలు నిషేధిస్తూ జీవో ఇచ్చారన్నారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌ చేపట్టిన నిరుద్యోగ దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. నిరుద్యోగ దీక్షతో రాష్ట్రంలో చైతన్యానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.  

ఉద్యోగాలు అడిగితే.. ఉన్నవి తొలగిస్తారా?

ఓవైపు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతుంటే ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వం ఊడగొడుతోందని బండి సంజయ్‌ మండిపడ్డారు. ఏడేళ్లుగా గ్రూప్‌ 1, డీఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వలేదనీ.. పైగా రాష్ట్రంలో 12వేల మంది విద్యా వాలంటీర్లను, ఏడు వేలకు పైగా ఫీల్డ్‌ అసిస్టెంట్లను; 600మందికి పైగా మిషన్‌ భగీరథ కార్మికుల్ని తొలగించారన్నారు. జనవరిలోపు ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వకపోతే సీఎం కేసీఆర్‌ జరిపే అసెంబ్లీ సమావేశాలను భాజపా కార్యకర్తలు అడ్డుకుంటారని హెచ్చరించారు. అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలు (ఆర్‌ఆర్‌ఆర్‌) సభలో అడుగడుగునా ప్రభుత్వాన్ని అడ్డుకుంటారన్నారు. సభలో ఎమ్మెల్యేలు, బయట తమ పార్టీ శ్రేణులు, నిరుద్యోగ యువత అసెంబ్లీని నడవనీయబోమన్నారు. దేనికైనా తెగించి కొట్లాడతామని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు భాజపా అంటే భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. తన దీక్షకు సంఘీభావం ప్రకటించిన ఓయూ విద్యార్థులతో పాటు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని