Bandi Sanjay: పేపర్‌ లీకేజీ వ్యవహారం.. కేసును నీరుగార్చేందుకే సిట్‌కు అప్పగింత: బండి సంజయ్‌

టీఎస్‌పీఎస్‌సీలో ప్రశ్నపత్రాల లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. లీకేజీ కేసును సైతం రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చేందుకే సిట్‌కు అప్పగించిందన్నారు.

Published : 15 Mar 2023 11:27 IST

హైదరాబాద్: పేపర్‌ లీకేజీ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ఎదుట ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న వారిని వదిలేసి న్యాయం కోసం పోరాడుతున్న బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. అరెస్టులు, జైళ్లు భాజపా కార్యకర్తలకు కొత్త కాదని.. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల పక్షాన పోరాడేందుకు ఎంతవరకైనా వెళ్తామన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘ప్రశ్నపత్రాల లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. అందుకు కారకులైన వారిని వదిలేసి పోరాడుతున్న వారిపై కేసులు పెట్టడం సిగ్గు చేటు. అరెస్టు చేసిన బీజేవైఎం నేతలను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలి. లేనిపక్షంలో ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రాల లీకేజీ కేసును దర్యాప్తు చేసేందుకు రాష్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. నయీం కేసు, డ్రగ్స్ కేసు, డేటా చోరీ.. ఇలా సిట్‌కు అప్పగించిన కేసులన్నీ నీరుగారిపోయాయి. అదే విధంగా లీకేజీ కేసును సైతం రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చేందుకే సిట్‌కు అప్పగించింది. ఈ కేసులో సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాల్సిన అవసరం ఉంది. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి’’ అని బండి సంజయ్‌ని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు