Published : 19 May 2022 15:15 IST

Telangana News: బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు: బండి సంజయ్‌

హైదరాబాద్: రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులివ్వడాన్ని సీఎం కేసీఆర్ చిల్లర వ్యవహారమని చెప్పడం అత్యంత దురదృష్టకరమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. నిధులు, విధులను నేరుగా గ్రామ పంచాయతీలకు బదలాయించాలన్నదే 73వ రాజ్యాంగ సవరణ ముఖ్య ఉద్దేశమని గుర్తు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తి మేరకే కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులిస్తూ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుస్తోందని చెప్పారు. విద్య, వైద్యం సహా 29 అంశాలను గ్రామాలకే బదలాయించాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ గ్రామ పంచాయతీల అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకుంది నిజం కాదా? అని నిలదీశారు. ఈ మేరకు బండి సంజయ్‌ ప్రకటన విడుదల చేశారు.

‘‘రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లు సహా వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల ద్వారానే జరగాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది. వాటిపై ఎమ్మెల్యేలకు పెత్తనమిచ్చి గ్రామ పంచాయతీలను సీఎం కేసీఆర్‌ ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులను కమీషన్ల కోసం కక్కుర్తిపడి పక్కదారి పట్టిస్తూ గ్రామాలను పూర్తిగా నీరుగారుస్తున్నది కేసీఆర్ కాదా? కమీషన్ల కోసం ట్రాక్టర్లు కొంటున్నది నిజం కాదా? కేంద్రం నిధులను జీతాలకు మళ్లిస్తోంది నిజం కాదని సీఎం చెప్పాలి.  గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేసీఆర్ చేతగానితనం వల్ల సర్పంచులు ఉన్న ఆస్తులను అమ్ముకుని, అప్పులపాలై ఉపాధి కూలీలుగా, వాచ్ మెన్లుగా, సెక్యూరిటీ ఉద్యోగులుగా కాలం వెళ్లదీస్తున్నారు.

జాతీయ పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా అన్ని రాష్ట్రాలు ఏటా ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే కేసీఆర్‌ మాత్రం ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా కశ్మీర్ వ్యాలీలోని ఓ కుగ్రామానికి వెళ్లి సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ పంచాయతీల ప్రాముఖ్యతను చాటిచెప్పిన గొప్ప నాయకుడు మోదీ. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సీఎం కేసీఆర్‌ ఇకనైనా మానుకోవాలి. లేనిపక్షంలో విజ్ఞులైన రాష్ట్ర ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు’’ అని బండి సంజయ్‌ హెచ్చరించారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని