Basavaraj Bommai: కర్ణాటకలో సీఎం మార్పు ఊహాగానాలు.. స్పందించిన బొమ్మై!

కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చుతున్నారంటూ వస్తోన్న ఊహాగానాలను ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్‌ బొమ్మై కొట్టిపారేశారు. అవన్ని నిరాధారమైనవని, అబద్ధాలేనని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం స్థిరంగా ఉందని, అలాగే...

Published : 12 Aug 2022 01:57 IST

బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చుతున్నారంటూ వస్తోన్న ఊహాగానాలను ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్‌ బొమ్మై కొట్టిపారేశారు. అవన్ని నిరాధారమైనవని, అబద్ధాలేనని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం స్థిరంగా ఉందని, అలాగే కొనసాగుతుందనీ స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధితోపాటు పార్టీ కోసం మరింత కష్టపడి పనిచేస్తానని చెప్పారు. ఇటీవల కరోనా బారిన పడి, కోలుకున్న సీఎం బొమ్మై.. గురువారం తిరిగి సాధారణ కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం మార్పు వ్యవహారంపై మొదటిసారి పెదవి విప్పారు.

తనను మార్చుతారని కాంగ్రెస్‌ చేసిన వరుస ట్వీట్లపై బొమ్మై స్పందిస్తూ.. ఆ పార్టీ ఇలాంటి ట్వీట్లు చేయడం ఇదే మొదటిసారి కాదన్నారు. ‘వాస్తవానికి.. వారి మనసుల్లోనే ‘అస్థిరత’ అనే భావన ఉంది. దాన్ని ప్రజల్లో వ్యాప్తి చేయాలని చూస్తున్నారు. కానీ.. ప్రజలు వారిని నమ్మరు’ అని చెప్పుకొచ్చారు. ‘నేను స్థితప్రజ్ఞుడిని. ఎందుకంటే.. నాకు నిజం తెలుసు కాబట్టి. కాంగ్రెస్‌వి కేవలం రాజకీయ ప్రేరేపిత ఆరోపణలే’ అని మండిపడ్డారు. కాంగ్రెస్‌లోనే ఆ ట్వీట్‌లపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. పైగా.. ఈ వ్యవహారంపై తనకు స్పష్టత ఉందని తెలిపారు.

ప్రస్తుత పరిణామాలతో తన సంకల్పం మరింత బలపడిందని బొమ్మై చెప్పారు. రానున్న రోజుల్లో రోజుకు రెండు గంటలు అదనంగా పని చేస్తానని, రాష్ట్రాభివృద్ధికి ఎక్కువ సమయం కేటాయిస్తానని తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, పెద్దఎత్తున ప్రజల్లోకి వెళ్తామని వెల్లడించారు. సీఎం మార్పుపై మొదట పార్టీలోనే చర్చలు వచ్చాయన్న ప్రశ్నకు బొమ్మై స్పందిస్తూ.. వాటికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఇదిలా ఉండగా.. భాజపా అధిష్ఠానం కర్ణాటక ముఖ్యమంత్రిని మార్చనుందంటూ కొద్దిరోజులుగా విస్తృత చర్చ సాగుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల కేంద్ర మంత్రి అమిత్‌ షా సైతం రాష్ట్రానికి వచ్చి.. స్థానిక నేతలతో చర్చలు జరపడంతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని