Bengal Politics: పశ్చిమ్‌ బెంగాల్‌లో భాజపాకు మరో షాక్‌

బెంగాల్‌లో భాజపాకు మరో షాక్‌ తగిలింది. ఎన్నికలకు ముందు తృణమూల్‌ కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరిన నేతలు తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. ......

Published : 31 Aug 2021 22:55 IST

కోల్‌కతా: బెంగాల్‌లో భాజపాకు మరో షాక్‌ తగిలింది. ఎన్నికలకు ముందు తృణమూల్‌ కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరిన నేతలు తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. నిన్న విష్ణుపూర్‌ ఎమ్మెల్యే తన్మోయ్‌ ఘోష్‌ భాజపాను వీడి తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరిన మరుసటి రోజే మరో ఎమ్మెల్యే అదే బాట పట్టారు. బాగ్దా నియోజకవర్గం నుంచి భాజపా తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన విశ్వజిత్‌ దాస్‌ మంగళవారం తృణమూల్‌లో చేరారు. భాజపాతో కలిసి పనిచేయడం తనకు అసంతృప్తిగా, అసౌకర్యంగా ఉందని పేర్కొన్నారు. భాజపాలోకి వెళ్లి తప్పు చేశానని, అందుకు తిరిగి వచ్చాయాలనుకున్నానని తెలిపారు. 

గతంలో ఉత్తర బొంగావ్‌ నుంచి తృణమూల్‌ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన  విశ్వజిత్‌దాస్‌.. ముకుల్‌రాయ్‌తో కలిసి అప్పట్లో భాజపాలో చేరారు. ఆ తర్వాత భాజపా ఎంపీ శాంతనుఠాకూర్‌తో ఆయనకు విభేదాలు తలెత్తాయి. మరోసారి ఉత్తర బొంగావ్‌ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నప్పటికీ ఆ సీటు ఆయనకు కేటాయించలేదు.  బాగ్దా సీటు ఇవ్వడంతో అప్పడే ఆయన భాజపా పట్ల అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆ సమయంలోనే తిరిగి తృణమూల్‌ కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఎన్నికలకు ముందు ముకుల్‌రాయ్‌, అరుణ్‌సింగ్‌ అడ్డుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ముకుల్‌రాయ్‌ తిరిగి తృణమూల్‌ గూటికి చేరడంతో విశ్వజిత్‌ కూడా తిరిగి వచ్చేందుకు ప్రయత్నించి చివరకు మంగళవారం సొంత గూటికి చేరుకున్నారు.  

మరోవైపు, ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపబోవని భాజపా చెబుతోంది. ఎన్నికల్లో కాషాయ దళం 77 సీట్లు గెలుచుకోగా.. ప్రస్తుతం ఆ పార్టీ బలం 72 స్థానాలకు పడిపోయింది. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా భాజపాను వీడేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దినాజ్‌పూర్‌ ఎమ్మెల్యే తృణమూల్‌ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని