
Mamata: సీఎస్ ఇకపై ప్రభుత్వ సలహాదారు
కోల్‌కతా: పశ్చిమ్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర సర్కారు మధ్య చీఫ్ సెక్రటరీ విషయంలో నెలకొన్న వివాదంలో మరో పరిణామం చోటుచేసుకుంది. సీఎస్‌గా ఉన్న ఆలాపన్ బంధోపాధ్యాయ్ను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. మంగళవారం నుంచి ఆయన సలహాదారుగా వ్యవహరించనున్నారు. సోమవారంతో సీఎస్ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో మమత తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై విరుచుకుపడ్డారు.
‘‘కేంద్రానిది పూర్తిగా ప్రతీకారం. ఇలాంటి వైఖరిని ఇంత వరకు ఎప్పుడూ చూడలేదు. అధికారులు ఏమైనా కట్టుబానిసలు అనుకుంటున్నారా? దేశం కోసం జీవితాంతం కష్టపడిన ఓ ఉద్యోగిని ఇలా వేధించడం ద్వారా కేంద్రం ఏం సందేశం ఇవ్వాలనుకుంటోంది?ఎంతోమంది బెంగాల్ కేడర్‌కు చెందిన వ్యక్తులు కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. వారందర్నీ వెనక్కి రప్పించమంటారా?’’ అని మమత ప్రశ్నించారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆయన సేవలు వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్లు మమత పేర్కొన్నారు.
సీఎస్ ఆలాపన్ బందోపాధ్యాయ్‌ను మంగళవారం ఉదయం దిల్లీ నార్త్‌బ్లాక్‌లో రిపోర్ట్ చేయాల్సిందిగా కేంద్రం సూచించింది. దీంతో ఆయనను రిలీవ్ చేయబోనని మమత బెనర్జీ సోమవారం ఉదయం ప్రకటించారు. ఆ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. సాయంత్రం ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. మరోవైపు పశ్చిమ్ బెంగాల్ ప్రధాన కార్యదర్శిగా హెచ్‌కే ద్వివేదిని కేంద్రం నియమించింది. కేంద్రం ఆదేశాలను పాటించని ఆలాపన్ బందోపాధ్యాయ్‌పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కేంద్రం తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.