బెంగాల్‌లో ముదురుతున్న ‘స్లోగన్‌ వార్‌’!

ఎన్నికల వేళ బెంగాల్‌లో భాజపా, టీఎంసీ మధ్య ప్రచారం జోరందుకుంది. ఒకరిని మించి మరొకరు నినాదాలు చేస్తుండటంతో తాజాగా ఆ రెండు పార్టీల మధ్య‘స్లోగన్‌ వార్‌’ ముదరుతోంది. ‘బెంగాల్‌ వాంట్స్‌ ఇట్స్‌ ఓన్‌ డాటర్‌ ’(బెంగాల్‌ తమ కుమార్తెనే సీఎంగా కోరుతోంది) అంటూ

Published : 27 Feb 2021 14:53 IST

కోల్‌కతా: ఎన్నికల వేళ బెంగాల్‌లో భాజపా, టీఎంసీ మధ్య ప్రచారం జోరందుకుంది. ఒకరిని మించి మరొకరు నినాదాలు చేస్తుండటంతో తాజాగా ఆ రెండు పార్టీల మధ్య‘స్లోగన్‌ వార్‌’ ముదరుతోంది. ‘బెంగాల్‌ వాంట్స్‌ ఇట్స్‌ ఓన్‌ డాటర్‌ ’(బెంగాల్‌ తమ కుమార్తెనే సీఎంగా కోరుతోంది) అంటూ టీఎంసీ ఇటీవల ట్విటర్‌ వేదికగా నినాదాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో భాజపా సైతం అదే నినాదంతో టీఎంసీని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. తమ పార్టీకి చెందిన మహిళా నాయకుల చిత్రాలతో అదే నినాదాన్ని జోడిస్తూ ఓ పోస్టర్‌ విడుదల చేసింది. ఆ పోస్టర్‌కు‘బెంగాల్‌ వాంట్స్‌ ఇట్స్‌ ఓన్‌ డాటర్.. నాట్‌ పిషి‌’(బెంగాల్‌ కుమార్తెను కోరుతోంది.. మేనత్తను కాదు)అని క్యాప్షన్‌ ఇస్తూ.. శనివారం ట్వీట్‌ చేసింది. అందులో రూపా గంగూలీ, దేవశ్రీ చౌదరీ, లాకెట్‌ ఛటర్జీ, భారతీ ఘోష్‌, అగ్నిమిత్ర పాల్‌ సహా పలువురు పార్టీకి చెందిన మహిళా నాయకులు ఉన్నారు. 

పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీకి పగ్గాలు అప్పగించనున్నారని గతంలో వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో భాజపా వారసత్వ రాజకీయాలంటూ టీఎంసీపై విమర్శలు ఎక్కుపెడుతోంది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సైతం మమతా, అభిషేక్‌లను ఉద్దేశిస్తూ.. బెంగాల్‌లో వారసత్వ రాజకీయాలు(మేనత్త,అల్లుడు) కొనసాగుతున్నాయని విమర్శించారు.

పశ్చిమబెంగాల్‌ సహా మొత్తం 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా బెంగాల్‌కు మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 29 వరకు 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని