Metro car shed: నాకు ద్రోహం చేసినట్టు ముంబయికి చేయకండి: ఉద్ధవ్‌ ఠాక్రే

మెట్రో కార్‌షెడ్‌పై గత ప్రభుత్వ నిర్ణయాన్ని పక్కనబెట్టి.. ఆ ప్రాజెక్టును తిరిగి ఆరే కాలనీలోనే నిర్మించాలని మహారాష్ట్రలో కొత్తగా కొలువుదీరిన శిందే సర్కార్‌ నిర్ణయించడం విచారకరమని శివసేన అధినేత, మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) అన్నారు.....

Published : 01 Jul 2022 16:06 IST

ముంబయి: మెట్రో కార్‌షెడ్‌పై గత ప్రభుత్వ నిర్ణయాన్ని పక్కనబెట్టి.. ఆ ప్రాజెక్టును తిరిగి ఆరే కాలనీలోనే నిర్మించాలని మహారాష్ట్రలో కొత్తగా కొలువుదీరిన శిందే సర్కార్‌ నిర్ణయించడం విచారకరమని శివసేన అధినేత, మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) అన్నారు. తనపై ఉన్న కోపాన్ని ముంబయి ప్రజలపై ప్రదర్శించొద్దన్నారు. సీఎంగా రాజీనామా చేసిన తర్వాత తొలిసారి ఆయన శివసేన భవన్‌లో మీడియాతో మాట్లాడారు. మెట్రో షెడ్ ప్రతిపాదనను మార్చొద్దని.. ముంబయి పర్యావరణంతో ఆటలాడొద్దని విజ్ఞప్తి చేశారు. మెట్రోకార్‌ షెడ్‌ ప్రాజెక్టు ఆరేలో కాకుండా కంజుర్‌మార్గ్‌లోనే ఉంచాలని కోరారు. కంజుర్‌మార్గ్‌ ప్రయివేటు స్థలం కాదన్నారు. ఆరేను పర్యావరణవేత్తలతో కలిసి రిజర్వు ఫారెస్ట్‌గా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ అడవిలో వణ్యప్రాణులు ఉన్నాయని చెప్పారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా 2019లో తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఉండుంటే.. ఇప్పుడు మహారాష్ట్రలో భాజపా ముఖ్యమంత్రి ఉండి ఉండేవారన్నారు. గతంలో శివసేన-భాజపా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చెరో రెండున్నరేళ్లు చొప్పున అధికారం పంచుకుందామని అమిత్‌ షాతో చర్చించిన అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. వారు అప్పుడు అలా చేసి ఉంటే మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం ఏర్పాటయ్యేది కాదన్నారు. తనకు ద్రోహం చేసినట్టుగా ముంబయికి చేయొద్దని భాజపాను ఉద్ధవ్‌ కోరారు. తమ పార్టీలో జరిగిన తిరుగుబాటు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని, ప్రజల ఓటును వృథాచేసిందని ఉద్ధవ్‌ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని