KTR: డబ్బులిస్తే తీసుకోండి.. ఓటు మాత్రం కారుకే వెయ్యండి: కేటీఆర్‌

భద్రాద్రి జిల్లా భాజపా అధ్యక్షుడు కోనేరు చిన సత్యనారాయణ భారాసలో చేరారు. మంత్రి కేటీఆర్‌ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు.

Updated : 19 Sep 2023 20:58 IST

హైదరాబాద్‌: కుంభకోణాలకు పాల్పడిన కాంగ్రెస్‌ నేతలు డబ్బులు బాగా సంపాదించి, వాటితో ఓట్లు కొనాలనుకుంటున్నారని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. డబ్బులిస్తే తీసుకోవాలని ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని ఓటర్లకు సూచించారు. భద్రాద్రి జిల్లా భాజపా అధ్యక్షుడు కోనేరు చిన్న సత్యనారాయణ భారాసలో చేరగా.. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అబద్ధపు హామీలను నమ్మొద్దన్నారు. 

రజాకార్‌ చిత్రంతో ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారు..

‘‘సెప్టెంబరు 17ని జాతీయ సమైక్యత దినంగా నిర్వహిస్తే కేంద్రంలో ఉన్నవారికి నచ్చలేదు. మోదీ ప్రభుత్వం, భాజపా తొమ్మిదేళ్లుగా ప్రజల్ని మోసగిస్తూనే ఉన్నాయి. మోదీ భ్రమల నుంచి ప్రజలు బయటపడుతున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ధైర్యముంటే 18కోట్ల ఉద్యోగాలేమయ్యాయని ప్రధాని ఇంటి వద్ద ధర్నా చేయాలి. రజాకార్ సినిమాతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రజాకార్, కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ అంటూ భావోద్వేగాలతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. సీఎం ఎవరవుతారో గ్యారంటీలేని కాంగ్రెస్ ఆరు గ్యారంటీల ప్రకటించింది. కాంగ్రెస్ వస్తే కటిక చీకట్లు, తాగునీటి ఇక్కట్లు, ఎరువులు, విత్తనాల కోసం కష్టాలు గ్యారంటీ. కాంగ్రెస్ వస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీం గ్యారంటీ. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు సీఎంలు, రాజకీయ అస్థిరత గ్యారంటీ. ఆరు గ్యారంటీలని డైలాగులు కొట్టిన కాంగ్రెస్ అభివృద్ధిపై ఒక్కమాటైనా చెప్పిందా?’’ అని  కేటీఆర్‌ ప్రశ్నించారు.

‘‘పేదలను మభ్య పెట్టి ఓట్లు దండుకోవాలన్న ఆలోచన తప్ప కాంగ్రెస్‌కు రాష్ట్ర అభివృద్ధిపై ఆలోచనేదీ? ఖమ్మంలో కొందరు భారాసను వీడి వెళ్లిపోయారు.. ఫర్వాలేదు. టికెట్ దక్కలేదన్న బాధను ప్రజల బాధగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దశాబ్దాల పాటు మీరు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఎందుకు చేయలేదు? ఖమ్మం జిల్లాలో నాలుగు రకరాలుగా చీలిపోయి అభివృద్ధికి దూరం కాకండి. కేసీఆర్ రైతుబంధు కావాలా.. కాంగ్రెస్ రాబంధులు కావాలో తేల్చుకోండి. అతిత్వరలో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసి 10లక్షల ఎకరాలకు నీరందిస్తాం. ఓటుకు రూ.2 నుంచి 3 వేలు ఇస్తామని ఖమ్మంలో కొందరు కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారట. కాంగ్రెస్ డబ్బులు ఇస్తే తీసుకోండి.. కానీ ఓటు మాత్రం కారు గుర్తుకే వేయండి. ముల్లును ముల్లుతోనే తీయాలి.. మోసాన్ని మోసంతోనే జయించాలి’’అని కేటీఆర్‌ అన్నారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు