Punjab Polls: ఏడేళ్లుగా ఎంపీ.. అయినా అద్దె ఇంట్లోనే ఉంటున్నారు: కేజ్రీవాల్‌ ప్రశంస

పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రచారం జోరందుకుంది. ఎన్నికల్లో బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగి తమ అభ్యర్థుల తరఫున ప్రచారంలో........

Published : 28 Jan 2022 16:49 IST

చండీగఢ్‌: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రచారం జోరందుకుంది. ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగి తమ అభ్యర్థుల తరఫున ప్రచారంలో తలమునకలయ్యారు. నిన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పంజాబ్‌లో పర్యటించగా.. తాజాగా ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ చండీగఢ్‌లో తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సంగ్రూర్‌ ఎంపీ, ప్రస్తుత ఎన్నికల్లో సీఎం అభ్యర్థి భగవంత్‌ మాన్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగవంత్‌ మాన్‌పై ప్రశంసలు కురిపించిన కేజ్రీవాల్‌.. గతంలో అకాలీదళ్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. భగవంత్‌ మాన్‌ చాలా సాధారణమైన జీవితం గడుపుతారనీ.. ఇతర రాజకీయ పార్టీల నేతల్లా పెద్ద పెద్ద భవంతులు, కార్లు ఆయన వద్ద లేవన్నారు. ఏడేళ్లుగా ఎంపీగా ఉన్నప్పటికీ ఆయన అద్దె ఇంట్లోనే నివసిస్తున్నారన్నారు. పంజాబ్‌లో తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే అవినీతి రహిత పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. 

పంజాబ్‌కు ఇప్పుడు పెద్ద అవసరం అదే..

పంజాబ్‌ను పాలించిన పార్టీలపై కేజ్రీవాల్‌ విమర్శలు గుప్పించారు. పంజాబ్‌లో ఎవరైనా ఎమ్మెల్యే అయితే చాలు మూడు నాలుగంతస్తుల భవంతులు, నాలుగైదు కార్లు ఉంటాయనీ.. కానీ భగవంత్‌ మాన్‌ ఏడేళ్లుగా ఎంపీగా కొనసాగుతున్నా అతి సాధారణ జీవితమే గడుపుతున్నారన్నారు. ఇటీవల రాష్ట్రంలో ఇసుక అక్రమ మైనింగ్‌ కేసులో సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ బంధువుల ఇంట్లో ఈడీ దాడులు చేసిన అంశాన్ని ప్రస్తావించారు. పంజాబ్‌ను కాంగ్రెస్‌ 26 ఏళ్ల పాటు దోచుకుంటే.. బాదల్‌ కుటుంబం 19 ఏళ్ల పాటు దోపిడీకి పాల్పడిందని కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఈ తరుణంలో రాష్ట్రానికి ప్రస్తుతం నిజాయతీ కలిగిన ముఖ్యమంత్రి రావడం పెద్ద అవసరంగా మారిందన్నారు. రాష్ట్రంలో ఓవైపు డ్రగ్స్‌ విక్రయ ఆరోపణలు, ఇసుక అక్రమ తవ్వకాల ఆరోపణలెదుర్కొంటున్న నేతలు.. ఎవరి నుంచీ పైసా కూడా తీసుకోని భగవంత్‌ మాన్‌ ఈ ఎన్నికల బరిలో ఉన్నారన్నారు.

నా కళ్లలో నీళ్లు తిరిగాయి!

దిల్లీలో కేజ్రీవాల్‌ సారథ్యంలోని ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని భగవంత్‌ మాన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. దిల్లీలో డివిజనల్‌ కమిషనర్‌ పిల్లలు, జడ్జి పిల్లలతో పాటు మురికివాడల్లో నివసించేవారి పిల్లలంతా ఒకే పుస్తకాన్ని ఒకే బెంచ్‌పై కలిసి చదువుకొనే పరిస్థితులు చూసి తన కళ్లలో నీళ్లు తిరిగాయన్నారు. పంజాబ్‌లోనూ విద్యారంగంలో అలాంటి విప్లవాన్ని తీసుకొస్తామని మాన్‌ హామీ ఇచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని