Bhatti Vikramarka: కమిటీల ద్వారా విభజన సమస్యలకు పరిష్కార మార్గాలు: భట్టి విక్రమార్క

కమిటీల ద్వారా విభజన సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

Updated : 06 Jul 2024 22:08 IST

హైదరాబాద్‌: కమిటీల ద్వారా విభజన సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన తర్వాత భేటీ వివరాలను భట్టి విక్రమార్క, ఏపీ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌ మీడియాకు వెల్లడించారు. ‘‘గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలపై సమావేశంలో మాట్లాడుకున్నాం. రెండురాష్ట్రాల ముఖ్యమంత్రులు కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాం. ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ వేయాలని నిర్ణయించాం.

సీఎస్‌లు, ముగ్గురు అధికారులతో రెండు వారాల్లోగా కమిటీ ఏర్పాటు చేస్తాం. వీరి స్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై మంత్రులతో మరో కమిటీని వేయాలని తీర్మానించాం. అక్కడ కూడా పరిష్కారం కాని అంశాలుంటే ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కార మార్గం కనుగొనాలని నిర్ణయించాం. డ్రగ్స్‌, సైబర్‌ నేరాల కట్టడికి రెండు తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించాం’’ అని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఏపీ మంత్రి సత్యప్రసాద్‌ మాట్లాడుతూ.. తెలుగు జాతి హర్షించే రోజు అని వ్యాఖ్యానించారు. విభజన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సీఎంలు మందుకు రావడం శుభపరిణామమన్నారు. డ్రగ్స్‌, గంజాయి నిర్మూలనకు ఏపీలోనూ చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. తెలంగాణ మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, ఏపీ మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేశ్‌ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని