Coal Mines: వేలం లేకుండానే సింగరేణికి బొగ్గు గనులివ్వాలి

గోదావరి పరీవాహకంలోని కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు బ్లాకులను సన్నిహిత పారిశ్రామికవేత్తల కంపెనీలకు అప్పగించేందుకు నాటి భారాస ప్రభుత్వం.. బొగ్గు గనుల వేలంలో పాల్గొననీయకుండా సింగరేణిని నిండా ముంచిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.

Published : 21 Jun 2024 06:14 IST

అప్పట్లో కేసీఆర్‌ వేలంలో పాల్గొనవద్దన్నారు.. అనుయాయ కంపెనీలకు కోల్‌ బ్లాకులు కట్టబెట్టారు..
వాటిని సింగరేణికే ఇవ్వాలని కేంద్రాన్ని కోరతాం
ఆ సంస్థను నిండా ముంచింది భారాసయే  
అఖిలపక్షంతో ప్రధాని వద్దకు..  భారాస నేతలూ రావాలి
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 

ఖమ్మంలో మాట్లాడుతున్న మల్లు భట్టి విక్రమార్క. చిత్రంలో కూనంనేని, తుమ్మల

ఈటీవీ, ఖమ్మం: గోదావరి పరీవాహకంలోని కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు బ్లాకులను సన్నిహిత పారిశ్రామికవేత్తల కంపెనీలకు అప్పగించేందుకు నాటి భారాస ప్రభుత్వం.. బొగ్గు గనుల వేలంలో పాల్గొననీయకుండా సింగరేణిని నిండా ముంచిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆయన గురువారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఖమ్మం కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడారు. 2021లో సింగరేణి సంస్థ బొగ్గు గనుల వేలంలో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేసినా.. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడ్డుకున్నారని భట్టి తెలిపారు. ఆ కోల్‌ బ్లాకులను ఏకపక్ష నిర్ణయంతో తమ అనుయాయులైన అరబిందో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ భాగస్వామి ఆరో కోల్‌ కంపెనీ, శ్రీ అవంతికా కాంట్రాక్టర్స్‌ (ప్రతిమా గ్రూప్‌)లకు అప్పగించారని పేర్కొన్నారు. ఇందుకోసం భాజపా, భారాసలకు ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో లబ్ధి చేకూరిందన్నారు. నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులో కార్యకలాపాలు ప్రారంభించనందున ఆ రెండు కంపెనీలకు ఇచ్చిన బొగ్గు గనుల్ని రద్దు చేసి.. వాటిని వేలం లేకుండా సింగరేణికి కేటాయించాలని డిమాండ్‌ చేశారు. క్విడ్‌ ప్రో కోకు సంబంధించి భారాస నేతలు కేసీఆర్, కేటీఆర్‌లలో ఎవరితోనైనా తాము చర్చకు సిద్ధమని భట్టి సవాల్‌ విసిరారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రిని కలుస్తాం

రాష్ట్ర ప్రయోజనాలు, సింగరేణి పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుక్రవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలుస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా ఆయన సింగరేణికి న్యాయం చేయాలని కోరారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే.. బొగ్గు గనులను వేలం లేకుండా సింగరేణికి కేటాయించాలని కేంద్రాన్ని కోరామని గుర్తుచేశారు. అవసరమైతే రాష్ట్రం నుంచి అఖిలపక్ష నేతలను తీసుకుని వెళ్లి ప్రధాని మోదీని కలుస్తామని పేర్కొన్నారు. భారాసకు చిత్తశుద్ధి ఉంటే, అఖిలపక్షంతో కలిసి వచ్చి గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని హితవు పలికారు. 

భారాస నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదం

పదేళ్ల పాటు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన భారాస ప్రభుత్వం.. సింగరేణినీ విచ్ఛిన్నం చేసిందని భట్టి మండిపడ్డారు. 2032-33 నాటికి 22 బొగ్గు గనులు మూతపడనుండడంతో సింగరేణి కొత్త గనులను సమకూర్చుకోవాల్సిన అనివార్యత ఏర్పడిందని చెప్పారు. దేశాన్ని పాలిస్తున్న భాజపా.. మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ డెవలప్‌మెంట్‌ రెగ్యులేషన్‌ చట్టం (1957)ను 2017న ఫిబ్రవరి 24న పార్లమెంటులో బిల్లు పెట్టి సవరించిందన్నారు. తద్వారా బొగ్గు గనులను ఏ ప్రభుత్వ రంగ సంస్థకూ కేటాయించటానికి వీల్లేకుండా, వేలం ద్వారా కట్టబెట్టే విధానాన్ని తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. అప్పట్లో ఆ బిల్లుకు భారాస ఎంపీలందరూ మద్దతు పలికారని గుర్తుచేశారు. సింగరేణికి గనులు దక్కకపోవటంలో భారాస పాత్ర కూడా ఉందన్నారు. 

కుట్రలు చేసిందే కేసీఆర్‌

2021 అక్టోబరు 29న వేలంలో పాల్గొనాలని సింగరేణి నిర్ణయించిందని, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని బొగ్గు గనులను సింగరేణి తీసుకోవద్దంటూ కేసీఆర్‌ నవంబరు 5న ఆదేశించారని భట్టి తెలిపారు. సింగరేణికి గనులు దక్కకుండా కేసీఆర్‌ కుట్రలు పన్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో బొగ్గు గనులు వద్దని, ఒడిశాలోని బంక్వీ బ్లాక్‌ బొగ్గు గనుల వేలంలో మాత్రం పాల్గొనాలని కేసీఆర్‌ అప్పట్లో సూచించారని పేర్కొన్నారు. వేలంలో సింగరేణి పాల్గొనకూడదనుకుంటే.. పక్క రాష్ట్రానికి ఎందుకు పంపించారని ప్రశ్నించారు. పార్లమెంటులో కేంద్రం చట్టం చేయడంలో ముమ్మాటికీ భారాస పాత్ర ఉందని ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు.  


తెలంగాణకు ఊపిరి సింగరేణి

-తుమ్మల

తెలంగాణకు జీవగడ్డ, ఊపిరి సింగరేణి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బొగ్గు గనుల విషయంలో కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా నైనీ బొగ్గు గనిని వేలంలో పాల్గొనకుండానే సింగరేణికి అప్పగించారని పేర్కొన్నారు. ఈ పద్ధతిలోనే గోదావరి పరీవాహక ప్రాంతంలోని గనులను సింగరేణికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం పక్షాన డిమాండ్‌ చేశారు. సింగరేణి మైనింగ్‌ చేయలేని ప్రాంతాల్లో గనుల్నే వేలం వేయాలని డిమాండ్‌ చేశారు. 


మాకు సంబంధం లేదు

-ప్రతిమ గ్రూప్‌

మ్మం జిల్లా సత్తుపల్లిలో బొగ్గు గనుల కేటాయింపు విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రతిమా ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ పి.అనిల్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తమ గ్రూపు కంపెనీలపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. బహుశా ఆయనను ఎవరో తప్పుదోవ పట్టించినట్లు తాము భావిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు సింగరేణి కాలరీస్‌కు సంబంధించిన ఏ విధమైన పనిలోనూ తమకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ భాగస్వామ్యం లేదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని