Assembly Elections: పంజాబ్‌, యూపీలో కొనసాగుతున్న పోలింగ్‌..బరిలో ఉన్న ప్రముఖులు వీరే

మూడో దశలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని 16 జిల్లాల్లో విస్తరించి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పంజాబ్‌లోనూ ఈరోజు పోలింగ్‌ జరుగుతోంది.....

Updated : 20 Feb 2022 14:09 IST

లఖ్‌నవూ: మూడో దశలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని 16 జిల్లాల్లో విస్తరించి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ ప్రారంభమైంది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పంజాబ్‌లోనూ ఈరోజు పోలింగ్‌ జరుగుతోంది. యూపీలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. పంజాబ్‌లో ఈ సమయాన్ని ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటలుగా నిర్ణయించారు.

  1. ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన బరిలో ఉన్న కర్హల్‌ నియోజకవర్గానికి నేడే పోలింగ్‌ జరుగుతోంది. యాదవ్‌లకు గట్టి పట్టున్న మెయిన్‌పురి జిల్లాలో ఉన్న ఈ సీటుపైనే అందరూ దృష్టి సారించారు. అఖిలేశ్‌కు ప్రత్యర్థిగా భాజపా కేంద్రమంత్రి ఎస్‌.పి.సింగ్‌ బఘేల్‌ను పోటీలో నిలిపింది. 1992లో ఎస్పీ ఏర్పాటైన నాటి నుంచి కేవలం ఒకేఒక్కసారి కర్హల్‌లో ఓడిపోయింది.
  2. యూపీలో నేడు మొత్తం 59 సీట్లకు పోలింగ్‌ జరుగుతోంది. వీటిలో 2017లో 49 స్థానాలను భాజపా కైవసం చేసుకోవడం గమనార్హం. ఎస్పీ తొమ్మిది, కాంగ్రెస్‌ ఒక స్థానంలో గెలిచింది. ఇక మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓడిపోవడం గమనార్హం.
  3. యూపీలో నేడు బరిలో ఉన్న మరికొంత మంది ప్రముఖులు వీరే... ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ చిన్నాన్న శివ్‌పాల్‌ యాదవ్‌, భాజపా సతీశ్‌ మహానా, రామ్‌వీర్‌ ఉపాధ్యాయ్‌, అసీం అరుణ్‌, కాంగ్రెస్‌కు చెందిన లూయిస్‌ కుర్షీద్‌. లూయిస్‌ కుర్షీద్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ కుర్షీద్‌ సతీమణి.
  4. నేడు జరుగుతున్న మూడో దశ పోలింగ్‌ పూర్తయితే.. 403 స్థానాలున్న యూపీలో దాదాపు సగం సీట్లకు పోలింగ్‌ పూర్తయినట్లే.
  5. 2017లో దక్షిణ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో ఉన్న 19 స్థానాల్లో భాజపా గెలుపొందింది. గతంలో ఇక్కడ బీఎస్పీ చాలా బలంగా ఉండేది. ఇక మధ్య యూపీలో ఎస్పీకి బలమైన క్యాడర్‌ ఉంది. అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే ఎస్పీకి ఈ ప్రాంతం చాలా కీలకం. 
  6. యూపీలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన కాన్పూర్‌లో నేడు పోలింగ్‌ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ భాజపా ఆధిపత్యం కొనసాగింది. 
  7. ఇక అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న సరిహద్దు రాష్ట్రం పంజాబ్‌లో నేడు ఒకే దశలో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 117 స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. 
  8. పంజాబ్‌లో వరుసగా రెండు సార్లు గెలిచిన శిరోమణి అకాలీదళ్‌-భాజపా కూటమి నుంచి 2017లో కాంగ్రెస్‌ అధికారం చేజిక్కించుకుంది. 77 స్థానాల్లో గెలుపొంది సీఎం పీఠాన్ని కైవసం చేసుకుంది. భాజపా కూటమి 18 సీట్లలో గెలవగా.. ఆప్‌ 20 స్థానాలను సొంతం చేసుకుంది. 
  9. పంజాబ్‌లో బహుముఖ పోటీ నెలకొంది. సుదీర్ఘకాలం నుంచి మిత్రపక్షాలుగా ఉన్న భాజపా, అకాలీదళ్‌ ఈసారి ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. సొంత పార్టీ పెట్టిన మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ భాజపాతో పొత్తుపెట్టుకున్నారు. మరోవైపు కాంగ్రెస్‌, ఆప్‌ నువ్వానేనా అన్నట్లుగా ప్రచారం నిర్వహించాయి.
  10. పంజాబ్‌లో ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ పోటీ చేస్తున్న చామ్‌కౌర్‌ సాహిబ్‌, పంజాబ్ కాంగ్రెస్‌ చీఫ్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూ, అకాలీదళ్‌ విక్రమ్ సింగ్‌ ప్రత్యర్థులుగా ఉన్న అమృత్‌సర్‌ ఈస్ట్‌, అమరీందర్‌ బరిలో ఉన్న పటియాలా, అకాలీదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ పోటీ చేస్తున్న జలాలాబాద్‌ స్థానాలపై అందరి దృష్టి ఉంది.

  యూపీ, పంజాబ్‌లో కొనసాగుతున్న పోలింగ్‌.. చిత్రాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని