Bihar: లాలూ ఉంటేనే బిహార్‌ నడుస్తుంది..!

బిహార్‌ రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి ఉత్కంఠగా మారుతున్నాయి. తన రాజకీయ మనుగడకు భాజపా నుంచి ముప్పు పొంచి ఉందని భావించిన సీఎం, జేడీ(యు) నేత నీతీశ్ కుమార్‌.. ఎన్డీయే కూటమికి గుడ్‌బై

Published : 09 Aug 2022 15:54 IST

రాజకీయ సంక్షోభం వేళ మాజీ సీఎం కుమార్తె ఆసక్తికర ట్వీట్‌

పట్నా: బిహార్‌ రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి ఉత్కంఠగా మారుతున్నాయి. తన రాజకీయ మనుగడకు భాజపా నుంచి ముప్పు పొంచి ఉందని భావించిన సీఎం, జేడీ(యు) నేత నీతీశ్ కుమార్‌.. ఎన్డీయే కూటమికి గుడ్‌బై చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష ఆర్జేడీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఆర్జేడీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజా రాజకీయ పరిణామాలపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె రోహిణి ఆచార్య స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లాలూ ఉంటేనే బిహార్‌ నడుస్తుందని అర్థం వచ్చేలా ఓ పాటను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

‘‘లాలూ లేకుండా బిహార్‌ నడవలేదు’’ అనే భోజ్‌పురి పాట వీడియోను ట్విటర్‌లో పోస్టు చేసిన రోహిణి ఆచార్య.. ‘‘పట్టాభిషేకానికి సన్నాహాలు జరుగుతున్నాయి. లాంతరు (ఆర్జేడీ పార్టీ గుర్తు) పట్టుకుని వస్తున్నారు’’ అని రాసుకొచ్చారు. ఈ ఏడాది బిహార్‌ శాసనమండలి ఎన్నికలకు ముందు ఓ ఆర్జేడీ అభ్యర్థి కోసం ఈ పాటను రూపొందించారు. ప్రముఖ భోజ్‌పురి నటుడు, గాయకుడు ఖేసరి లాల్‌ యాదవ్‌ ఈ పాటను పాడారు. ఇక లాలూ మరో కుమార్తె రాజ్‌ లక్ష్మీ యాదవ్‌ కూడా తన తండ్రి, సోదరుడి ఫొటోలను షేర్‌ చేశారు. ‘‘బిహార్‌ తేజస్వీ పాలనను కోరుకుంటోంది’’ అని ఆమె రాసుకొచ్చారు.

ఈ సాయంత్రం నితీశ్‌ రాజీనామా..

భాజపాతో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమైన నీతీశ్‌.. ఆర్జేడీ, కాంగ్రెస్‌, ఇతర విపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇదే విషయమై ఈ సాయంత్రం ఆయన రాష్ట్ర గవర్నర్‌ను కలిసి తన రాజీనామాను సమర్పించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆయన వెంట ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ కూడా రాజ్‌భవన్‌ వెళ్లనున్నట్లు సమాచారం. నీతీశ్‌కు మద్దతుగా విపక్షాల కూటమి నేతలు సంతకాలు చేసిన లేఖను తేజస్వీ గవర్నర్‌కు అందించనున్నట్లు తెలుస్తోంది. రాజీనామా అనంతరం.. తదుపరి ప్రభుత్వ ఏర్పాట్లపై నీతీశ్‌, తేజస్వీ చర్చించనున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం.

కాగా.. ఆర్జేడీతో కలిసి నీతీశ్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తేజస్వీకి మళ్లీ ఉపముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు హోం శాఖను కూడా కేటాయించే అవకాశాలున్నాయి. గతంలో 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యు), ఆర్జేడీ, కాంగ్రెస్‌ కలిసి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు తేజస్వీ డిప్యూటీ సీఎంగా ఉండగా.. లాలూ మరో కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ మంత్రిగా పనిచేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని