తేజస్వీ విజయావకాశాలను దెబ్బతీసిన కాంగ్రెస్‌?

బిహార్‌లో మహాగట్‌బంధన్‌ కూటమి మరోసారి విఫలమైంది. కౌంటింగ్‌ సరళిని బట్టి చూస్తే అది రెండోస్థానానికే పరిమితమైంది. ఇక భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం దిశగా

Published : 10 Nov 2020 20:19 IST

బిహార్‌లో మరోసారి జాతీయ పార్టీ ఫ్లాప్‌ షో..

పట్నా : బిహార్‌లో మహాగట్‌బంధన్‌ కూటమి మరోసారి విఫలమైంది. కౌంటింగ్‌ సరళిని బట్టి చూస్తే అది రెండోస్థానానికే పరిమితమైంది. ఇక భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే ఇక్కడ కాంగ్రెస్‌ ఫ్లాప్‌ షో.. తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని కూటమి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు ఇచ్చారా?
మహగట్‌బంధన్‌ కూటమిలో సీట్ల పంపకం విషయంలో తొలి నుంచి వివాదాలు కొనసాగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌కు తన సత్తాకు మించి ఎక్కువ సీట్లు ఇచ్చారని పలువురు అంటున్నారు. కూటమి విజయావకాశాలపై ఈ అంశం చాలా ప్రభావం చూపించిందని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూటమి తరఫున ఆర్జేడీ 144 స్థానాల్లో పోటీ చేయగా.. ఆ తర్వాత ఎక్కువ స్థానాల్లో(70 సీట్లు) కాంగ్రెస్‌ బరిలోకి దిగింది. ఇక సీపీఎంకు నాలుగు స్థానాలు కేటాయించగా.. సీపీఐకి 6, సీపీఐ(ఎంఎల్‌)కు 19 స్థానాలు ఇచ్చారు. కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసిన స్థానాల కంటే తక్కువ ఇచ్చి ఉంటే ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉండేవని పలువురు అంటున్నారు.

కాంగ్రెస్‌ కంటే ఇతర పార్టీలే..
అయితే కౌంటింగ్‌ సరళిని బట్టి చూస్తే.. కాంగ్రెస్‌ కంటే ఇతర పార్టీలే మెరుగైన ఫలితాలను రాబడుతున్నాయి. భాజపా అతి పెద్ద పార్టీగా అవతరించగా.. ఆర్జేడీ, జేడీయూ తర్వాత కాంగ్రెస్‌ ఇక్కడ నాలుగో స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్‌ కంటే తక్కువ స్థానాల్లో పోటీ చేసిన వామపక్షాలు కూడా మెరుగైన ఫలితాలనే సాధిస్తున్నాయి.

ఇక బిహార్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రచారం నిర్వహించినప్పటికీ ఓట్లు రాబట్టలేకపోయాయ.

గత లోక్‌సభ ఎన్నికల్లోనూ..
గత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే కూటమి బరిలోకి దిగి చతికిలపడింది. 40 స్థానాలకు గాను ఎన్డీఏ 39 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్‌ ఒక్క స్థానానికి పరిమితమైంది. ఆర్జేడీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కూటమి విఫలమైందని విశ్లేషకులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని